హరిత టపాసులతో కాలుష్యానికి చెక్‌ 

1 Nov, 2021 04:05 IST|Sakshi

మామూలు వాటికంటే 30 నుంచి 50 శాతం తక్కువ కాలుష్యం 

అందుబాటులో అన్ని రకాల హరిత టపాసులు 

వాయు, శబ్ద కాలుష్యం లేకుండా వాటినే కాల్చాలి 

సాక్షి, అమరావతి: దీపావళి సందర్భంగా పెద్దఎత్తున వెలువడే వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి హరిత టపాసులు చక్కని ప్రత్యామ్నాయంగా మారాయి. తక్కువ కాలుష్యం వచ్చే హరిత టపాసులనే దీపావళి రోజున వినియోగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చాయి. దీపావళి సందర్భంగా వినియోగించే సాధారణ టపాసుల వల్ల విపరీతమైన కాలుష్య కారకాలు విడుదలై అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో పీల్చే గాలి అత్యంత విషపూరితంగా మారడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

రాష్ట్రంలో దీపావళి రోజున వాయు కాలుష్యం సాధారణ రోజు కంటే ఐదురెట్లు ఎక్కువ ఉన్నట్లు గతంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధారించారు. సాధారణంగా గాలిలో ధూళికణాలు (పీఎం 10, పీఎం 2.5) 60కి మించకూడదు. కానీ దీపావళి రోజున 300 నుంచి 400కు పైగా ఉంటున్నాయి. టపాసుల నుంచి బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులు, లోహాల ధూళి వెలువడుతోంది. అలాగే శబ్దాలు సాధారణ స్థాయి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. వీటివల్ల ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయి. అందుకే హరిత టపాసులు వాడాలని కాలుష్య నియంత్రణ మండలి ప్రచారం చేస్తోంది.  

అన్నిచోట్ల అందుబాటు 
తక్కువ కాలుష్య కారకాలు విడుదల చేసేలా హరిత టపాసుల ఫార్ములాను మూడేళ్ల కిందట శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌), జాతీయ పర్యావరణ, ఇంజనీరింగ్‌ పరిశోధన సంస్థ (నీరి) సంయుక్తంగా రూపొందించాయి. బాణసంచా తయారు చేసేవారికి దీని గురించి వివరించి ఈ ఫార్ములాతోనే టపాసులు తయారు చేయాలని ఈ సంస్థలు కోరాయి. అనేకమంది తయారీదారులు ఇందుకోసం ఒప్పందాలు కూడా చేసుకున్నారు.తక్కువ బూడిద, ముడిపదార్థాలను వాడి చిన్న సైజులో హరిత టపాసులను తయారు చేస్తారు.

చూడ్డానికి ఇవి మామూలు టపాసుల్లానే ఉంటాయి. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, బాంబులు వంటివి కూడా ఉంటాయి. ఇవి సాధారణ టపాసుల కంటె 30 నుంచి 50 శాతం తక్కువ ధూళి కణాలను విడుదల చేస్తాయి. కాలుష్యకారక వాయువులు, పొగ, శబ్దాలు కూడా తక్కువగానే విడుదలవుతాయి. సాధారణ టపాసులు విక్రయించే షాపుల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. అలాగే పెద్ద షాపులు, సూపర్‌ మార్కెట్లతోపాటు ఆన్‌లైన్‌లోను ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా గ్రీన్‌లోగో, క్యూ ఆర్‌ కోడ్‌ ఉంటాయి. 

హరిత టపాసులతో పర్యావరణ పరిరక్షణ 
ప్రజలందరు హరిత టపాసులను కాల్చాలి. అప్పుడు ప్రజారోగ్యానికి ఇబ్బందులు తప్పుతాయి. పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దీపాల పండుగను అందరు సురక్షితంగా జరుపుకోవడానికి హరిత టపాసులు ఉపయోగపడతాయి.  
– అశ్వినీకుమార్‌ పరిడ, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌    

మరిన్ని వార్తలు