వాయు కాలుష్య నియంత్రణే లక్ష్యం

17 Oct, 2021 02:48 IST|Sakshi

30 శాతం మేర తగ్గించేందుకు రూ.639 కోట్లతో ప్రణాళిక 

జిల్లా కేంద్రాల్లో కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలు 

వాయు కాలుష్యంపై ఫిర్యాదుల స్వీకరణకు త్వరలో మొబైల్‌ ‘యాప్‌’

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది. ఇప్పుడున్న వాయు కాలుష్యాన్ని ఐదేళ్లలో కనీసం 30% తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. గాలిలో పీఎం10(పర్టిక్యులర్‌ మ్యాటర్‌/చిన్న ధూళి కణాలు), పీఎం 2.5(సూక్ష్మ ధూళి కణాలు) 60కి మించి ఉండకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో 70 నుంచి 80 వరకూ ఉంటున్నాయి.

రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం వాహనాలు. వాటి నుంచి వెలువడే పొగ వల్లే గాలిలోకి ప్రమాదకర కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి. దేశంలో వాయు కాలుష్యం పెరుగుతున్న 142 నగరాల్లో రెండు(విశాఖ, విజయవాడ) మన రాష్ట్రంలో ఉన్నట్టు కేంద్రం గతంలో ప్రకటించింది. వీటితో పాటు మిగిలిన 11 జిల్లా కేంద్రాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది.

కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీలు: ఇందుకోసం ప్రతి జిల్లా కేంద్రానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన అక్కడి మున్సిపల్, రవాణా, పరిశ్రమల, కాలుష్య నియంత్రణ మండలి, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో ఇంప్లిమెంటేషన్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ నగరాల్లో ఉన్న పీఎం 10, పీఎం 2.5 ఎంత ఉందో తెలుసుకుని దాన్ని 60కి తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకోవాలో ఈ కమిటీలు నిర్ణయించి అమలు చేస్తుంది.

ఆ కేంద్రాల్లో కాలుష్యం ఎక్కువగా వస్తున్న హాట్‌ స్పాట్స్‌ను గుర్తించి దాన్ని తగ్గించేందుకు సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి దానికి బాధ్యుల్ని నియమించింది. నగరాల్లో కార్యాచరణ ప్రణాళికలు, హాట్‌ స్పాట్స్‌లో సూక్ష్మ ప్రణాళికలను అమలు చేసేందుకు రూ.639 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్థానిక సంస్థలు, పరిశ్రమల సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ను ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. మిగిలిన గ్యాప్‌ ఫండింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. మొత్తం సొమ్ములో రూ.274 కోట్లు విశాఖలో, రూ.232 కోట్లు విజయవాడలో వచ్చే ఐదేళ్లలో ఖర్చు చేస్తారు. మిగిలిన సొమ్ముతో 11 నగరాల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటారు.  

 జిల్లా కేంద్రాల్లో కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలు 
ప్రతి జిల్లా కేంద్రంలో వాయు కాలుష్యాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు నిరంతర వాయు కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల(యాంబియంట్‌ ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్ల)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు నగరాల్లోనే ఇవి ఉన్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆదేశాలతో తొలిసారిగా ప్రతి జిల్లాకూ ఒక స్టేషన్‌ ఏర్పాటు కానుంది. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో ఒక్కో నగరంలో నాలుగైదు స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.

ఇందుకోసం క్లీన్‌ ఎయిర్‌ ఏపీ కింద పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సహకారం తీసుకుంటున్నారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ నగరాల్లో వాయు కాలుష్యాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఆంధ్రా యూనివర్సిటీతో కాలుష్య నియంత్రణ మండలి ఒప్పందం చేసుకుంది. తిరుపతి, విజయవాడ, గంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాలకు సంబంధించి తిరుపతి ఐఐటీ సహకారం తీసుకోనుంది. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు నగరాలకు సంబంధించి తిరుపతిలోని నేషనల్‌ అట్మాస్పియరిక్‌ రీసెర్చి లేబొరేటరీ సహకారం తీసుకుంటారు. 

పక్కా యాక్షన్‌ ప్లాన్‌తో ముందుకు.. 
రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.639 కోట్లతో పక్కా యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేశాం. సిటీ స్థాయి ప్రణాళిక, ఎక్కువ కాలుష్యం విడుదలయ్యే చోట్ల సూక్ష్మ ప్రణాళికలతో ముందుకెళుతున్నాం. ఇందుకోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి అవసరమైన నిధులిస్తున్నారు. కాలుష్య నియంత్రణలో ఏపీ మొదటి స్థానంలో ఉండాలని ఆయన నిర్దేశించారు. మొట్టమొదటిసారిగా అన్ని జిల్లా కేంద్రాల్లో వాయు కాలుష్యాన్ని తెలుసుకునే కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాయు కాలుష్యంపై ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు త్వరలో ఒక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం.
– అశ్వినికుమార్‌ పరిడ, చైర్మన్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి    

మరిన్ని వార్తలు