15న రెండు అల్పపీడనాల ప్రభావం

13 Oct, 2021 03:48 IST|Sakshi

రెండు రోజుల్లో నైరుతి నిష్క్రమణ

సాక్షి, విశాఖపట్నం:  రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రెండు రోజుల్లో మొదలవుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి వెళ్లిపోతున్నాయని పేర్కొంది. ఈ నెల 15న రాష్ట్రంలో వాతావరణపరంగా అరుదైన ప్రక్రియ.. రెండు అల్పపీడనాలు ప్రభావం చూపే సూచనలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. ఇది అల్పపీడనంగా మారి ఈ నెల 15న చిత్తూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి.

ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరానికి చేరుకోనుంది. ఇది ఈ నెల 15న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు అల్పపీడనాలు రాష్ట్రంపై ప్రభావం చూపించడం అరుదని చెబుతున్నారు. అల్పపీడనం తుపానుగా బలపడే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదని, రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే రెండురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గత 24 గంటల్లో చిల్లకూరులో 72 మిల్లీమీటర్లు, బండారుపల్లెలో 65.5, మారేడుమిల్లిలో 60, వెంకటగిరికోటలో 56.5, పలమనేరులో 56, గోపాలపురంలో 52, సైదాపురంలో 49.5, బోగోలులో 47.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.  

మరిన్ని వార్తలు