పాండిచ్చేరిని తాకిన రూ.300 వైద్యం

22 Sep, 2020 05:06 IST|Sakshi

డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడిన ఆ రాష్ట్ర సీఎం  

కర్నూలు(హాస్పిటల్‌): కరోనా వైరస్‌ నుంచి బాధితులు త్వరితగతిన బయటపడడానికి స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి సూచించిన రూ.300 వైద్యం ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది. ఆదివారం రాత్రి పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావు తదితరులు అమెరికాకు చెందిన డాక్టర్లతో పాటు ప్రభాకర్‌రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పాండిచ్చేరిలో కరోనా తీవ్రత గురించి.. దాన్ని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

ఈ సమయంలో రూ.300 వైద్యం గురించి మంత్రి కృష్ణారావు పాండిచ్చేరి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రభాకర్‌రెడ్డి వివరించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మందుల గురించి వివరించానని.. దీనిపై సీఎం నారాయణస్వామి సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. పాండిచ్చేరిలోనూ రూ.300 మందులు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పినట్లు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితం వచ్చే వరకు వేచి ఉండకుండా రూ.300 మందులు వాడటంవల్ల మంచి ఫలితాలుంటాయని చెప్పారు. 

మరిన్ని వార్తలు