పొందూరు చేనేతలు..  అద్భుతాల ఆనవాళ్లు!

15 Apr, 2021 14:45 IST|Sakshi
ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేస్తున్న ఖాదీ వస్త్ర ప్రేమికులు

ఖద్దరు దుస్తులతో సౌకర్యం

పొందూరు వస్త్రాల విశిష్టత సర్వవిదితం

గాంధీజీ నుంచి నవతరం వరకు అందరూ సమ్మోహనం

విభిన్న శ్రేణులతో అన్ని వర్గాలూ వినియోగించే అవకాశం

చుట్టుకుంటే సోయగం.. కట్టుకుంటే సౌందర్యం.. చేతపట్టుకుంటే చేజారిపోయే గుణం. మదిలో పెట్టుకుంటే మరిచిపోలేని మనోహర లావణ్యం. ఇవేవీ పూలమాలల వర్ణనలు కావు. వస్త్ర విశేషాల ప్రత్యేకతలు! అవును నిజం. ఈరోజున ప్రత్యేకించి పరిచయం అవసరం లేని మధురానుభూతులు. అవి పొందూరు చేనేతలు. తరతరాలుగా మాన్యుల, సామాన్యులను అలరించి.. నేతల నుంచి జీతగాళ్ల వరకు అందరి శరీరాలను మెరిపించే అసలు సిసలు అందాల ఇంద్రధనసులు.. నిపుణులైన నేతగాళ్లు సృజించిన అద్భుతాల ఆనవాళ్లు. మామూలు పత్తిదారాలు అద్భుతాల తారాహారాల్లా పెనవేసుకుని ఎవరి దేహానికైనా కొత్తకాంతులు ఇచ్చే ఇంద్రజాల విశేషాలు.. పొందూరు ఖద్దరు సిత్రాలు. కాలానికి తగ్గట్టు శరీరానికి సౌకర్యమిచ్చే.. తరాలకు తగ్గట్టు అందరినీ ఆకట్టుకునే ఈ ఖద్దరు అద్భుతాలు.. మన ఒంటిపై చేనేతల గిలిగింతలు. స్థాయితో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉన్న పొందూరు వస్త్రాలు ఔరా అనిపించే హస్తకళా చిత్రాలు.  

పొందూరు (శ్రీకాకుళం జిల్లా): వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా ఇదీ పొందూరు ఖాదీ వస్త్రాల ప్రత్యేకత. ఈ వస్త్రాలను ధరిస్తే ఎంతో హుందాగా, సౌకర్యవంతంగా ఉంటాయి. అతి సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు ధరించేందుకు వీలుగా వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. మహాత్మా గాంధీ నుంచి ప్రస్తుత రాజకీయ నాయకులు వరకు పొందూరు ఖాదీకి అభిమానులే. ఇదీ పొందూరు ఏఎఫ్‌కేకే సంఘంలో తయారవుతున్న ఖాదీ ప్రత్యేకత.


అందుబాటు ధరల్లోనే... 
ఖాదీలో షర్టులు, పంచెలు, లుంగీలు, తువ్వాళ్లు, రుమాల్లు, చీరలు లభ్యమవుతున్నాయి. ఖాదీ షర్టు క్లాతు మీటరు ఖరీదు రూ. 216 నుంచి రూ. 1585 వరకు పలుకుతోంది. ఖాదీ రడీమేడ్‌ షర్టులు రూ. 550 నుంచి రూ.1000 వరకు ధరలు ఉన్నాయి. పంచెలు రూ.1300 నుంచి రూ.10 వేలు(ఏఎన్‌ఆర్‌ అంచు), లుంగీలు రూ.250 నుంచి రూ.400, టవల్స్‌ రూ.200 నుంచి రూ.350 వరకు, చీరలు రూ. 3వేలు నుంచి రూ.12 వేలు వరకు  ధర పలుకుతున్నాయి. ఇక్కడ లభిస్తున్న ఫ్యాంట్‌ క్లాత్‌ వావిలాలలో తయారవుతుంది. పొందూరు ఏఎఫ్‌కెకె సంఘం కేవీఐసీ(ముంబై) పరిధిలో పనిచేస్తుంది. ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు గుంటూరు, వావిలాల, మెట్టుపల్లి, తుని తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, మచిలిపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు.  

సౌకర్యవంతంగా ఉంటాయి...
చాలా ఏళ్లుగా ఖాదీ వస్త్రాలను ధరిస్తున్నాను. వీటిని ధరిస్తే ఎంతో సుఖంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. హుందాతనం ఉట్టిపడుతుంది. వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది.   
– వాండ్రంగి కొండలరావు, ఖాదీ వస్త్ర ప్రేమికుడు, పొందూరు

ఊహ తెలిసినప్పటి నుంచీ...
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే వృత్తిని నమ్మి జీవిస్తున్నాం. నలుగురు పిల్లలకు పెళ్లిళ్లు చేశాను. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఎంతో మక్కువగా పని చేస్తున్నాం. గత రెండేళ్లుగా నేతన్న నేస్తం రూ. 48 వేలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించారు. దీంతో ఎంతో ఊరటగా ఉంది.  
– బస్వా మోహనరావు, ఖాదీ కార్మికుడు, పొందూరు

వ్యాపారం బాగుంది...
మా సంస్ధ దుకాణాల్లో వ్యాపారం బాగానే జరుగుతోంది. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సౌకర్యం అందుబాటులోకి రావడంతో వ్యాపారం ఊపందుకుంది. యువత కూడా ఖాదీ వస్త్రాలపై మొగ్గుచూపుతూ కొనుగోలు చేస్తున్నారు. జీన్‌ ఫ్యాంట్‌పై మా ఖాదీ షర్టును ధరిస్తున్నారు.  
– దండా వెంకటరమణ, కార్యదర్శి, ఏఎఫ్‌కేకే సంఘం, పొందూరు 

మరిన్ని వార్తలు