Konaseema Issue: పోలీసులు రాకపోతే నా కుటుంబం సజీవ దహనమయ్యేది

25 May, 2022 04:26 IST|Sakshi
ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న పోలీసులు

పక్కా పథకంతోనే పెట్రోల్‌ డబ్బాలతో వచ్చారు

ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌

అమలాపురం టౌన్‌: ‘మా ఇంటి పైఅంతస్తులో నేను, నా కుటుంబ సభ్యులు ఉన్నాం. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బయటకు వచ్చేసరికి ఇల్లంతా మంటల్లో ఉంది. పోలీసులు ముఖ్యంగా డీఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. తక్షణమే నన్ను, నా భార్య, కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చి రక్షించారు. లేకపోతే నా కుంటుంబ ఆ మంటల్లో సజీవ దహనం అయ్యేది’ అని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కోనసీమ జిల్లా పేరు మార్పుపై మంగళవారం జరిగిన విధ్వంసంలో భాగంగా ఆందోళనకారులు ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టి బీభత్సం సృష్టించారు. ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఎమ్మెల్యే పొన్నాడ మంగళవారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. ఇది కచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర అన్నారు. ప్రతిపక్ష నేతలు వెనక ఉండి వారి కార్యకర్తలను ఉసిగొల్పి పక్కా పథకంతో విధ్వంసానికి పాల్పడ్డారని చెప్పారు.

పెట్రోల్‌  డబ్బాలతో వచ్చి ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేసి నిప్పు పెట్టారంటే ఎంతటి పక్కా ప్రణాళికతో వచ్చారో అర్థం అవుతోందన్నారు. బస్సులను కూడా అలాగే ధ్వంసం, దహనం చేశారన్నారు. పోలీసులపై కూడా కర్కశంగా రాళ్లు రువ్వారని, ఇవన్నీ చూస్తుంటే ముందస్తు వ్యూహంతోనే దాడులు, ధ్వంసాలకు దిగినట్టు స్పష్టమవుతోందని ఎమ్మెల్యే అన్నారు.  

మరిన్ని వార్తలు