బాబు, ఎల్లో మీడియా గోబెల్స్‌ ప్రచారానికి తెరపడింది: పొన్నవోలు

16 Jan, 2024 14:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో బిగ్‌ షాక్‌ తగిలింది. స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో సుప్రీం తీర్పులపై అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

తీర్పు అనంతరం పొన్నవోలు మీడియాతో మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. ఈ కేసు నుంచి చంద్రబాబు నాయుడు బయటపడేందుకు సాంకేతిక కోణాలు వెతికినా లాభం లేకపోయింది. సుప్రీంకోర్టులో ఈరోజు పరిణామాలను స్వాగతిస్తున్నాం. చంద్రబాబు పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎక్కడా అనుమతించలేదు. కేసు విషయంలో నన్నే అరెస్ట్‌ చేస్తారా? అంటూ ఊగిపోయారు. 

రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తీసిపుచ్చింది. నేరం బయటపడేసరికి గవర్నర్‌ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారు. కొన్ని అబద్దాలను ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రచారం చేయించారు. ఇన్నాళ్లు చేసిన విష ప్రచారం తప్పని తేలిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు తీరు తేటతెల్లమయింది. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నానికి సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డుకట్ట పడింది. బాబు గోబెల్స్ ప్రచారానికి, ఎల్లో మీడియా అసత్యాలకు తెరపడింది అంటూ కామెంట్స్‌ చేశారు. 

తీర్పు ఎలా వెలువరించారంటే..
తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. స్కిల్‌ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్‌ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు. 

ముందుగా జస్టిస్‌ బోస్‌ తీర్పు చదువుతూ.. "ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్‌ ఆర్డర్‌ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్‌ ఆర్డర్‌ నిర్వీర్యం కాదు." అని జస్టిస్‌ బోసు తీర్పు ఇచ్చారు. 

జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్‌ త్రివేది తీర్పు ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: బాబు రిమాండ్‌ సబబే.. కేసు కొట్టేయలేం

>
మరిన్ని వార్తలు