‘పిల్‌’లతో సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు

23 Mar, 2022 03:26 IST|Sakshi

చట్ట నిబంధనలకు లోబడే పేదల కోసం భూములు తీసుకుంటున్నాం

హైకోర్టుకు నివేదించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు పెద్దఎత్తున నివాస వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. కానీ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ‘పిల్‌’ల పేరుతో కొందరు అడ్డుకుంటున్నారని వివరించారు. భూములిచ్చిన వారికి, తీసుకుంటున్న వారికి లేని అభ్యంతరం పిటిషనర్లకు ఎందుకో అర్థంకావడంలేదని.. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆవ భూముల వ్యవహారంలో జేఎన్‌టీయూ సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందుంచాలని అదనపు ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను 25కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.

పేదలకు భూములు ఇవ్వొద్దంటూ పిల్‌..
తూర్పు గోదావరి జిల్లా.. కోరుకొండ, రాజానగరం మండలాల్లో ఉన్న ఆవ భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు, ఆ భూముల విషయంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎ.శ్రీనివాసరావు 2020లో హైకోర్టులో ‘పిల్‌’ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అప్పటి సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఆవ భూములను కేటాయించవద్దని 2020లో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇదే అంశంపై మరిన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

వీటన్నింటిపై సీజే జస్టిస్‌ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలు వినిపిస్తూ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం, పరిహారం చెల్లించిన తరువాతే భూములు తీసుకున్నామన్నారు. శాస్త్రీయ అధ్యయనం తరువాత ఎకరాకు రూ.45 లక్షల ధరను నిర్ణయించారన్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ రూ.300 కోట్లయితే పిటిషనర్లు విస్మయకరంగా రూ.700 కోట్ల మేర కుంభకోణం జరిగిందని చెబుతున్నారని సుధాకర్‌రెడ్డి వివరించారు.  

మరిన్ని వార్తలు