వారు ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తున్నారు

28 Jul, 2022 04:29 IST|Sakshi

కొన్ని పత్రికలు, చానల్స్‌పై హైకోర్టుకు నివేదించిన అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని పత్రికలు, టీవీ చానల్స్‌ ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తున్నాయని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. వాటి కథనాలనే కొందరు శాసనాలుగా భావిస్తున్నారని తెలిపారు. తిరుపతి కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ ఎన్నికపై దాఖలు చేసిన వ్యాజ్యంలో పిటిషనర్లు కూడా అలాగే భావిస్తున్నారన్నారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని,  ప్రాథమిక దశలోనే కొట్టేయాలని కోరారు. ఎన్నిక ప్రజాస్వామ్య, న్యాయబద్ధంగానే జరిగిందని వివరించారు. ఎన్నికపై అభ్యంతరం ఉంటే ఏం చేయాలో చట్టం చెబుతోందని, దాని ప్రకారం వారు సహకార ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ ఎన్నికపై సహకార శాఖ రిజిస్ట్రార్‌ చేత విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరగా, న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందనరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన తిరుపతి కోఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకు ఎన్నికను రద్దు చేసి, రీపోలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన కె.రజనీకాంత్‌నాయుడు, మరో 11 మంది దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందనరావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. టౌన్‌ బ్యాంక్‌ ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగిందన్నారు. నకిలీ కార్డులు సృష్టించి ఓట్లు వేయించారని, ఎమ్మెల్యేలు స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఫొటోలను చూపారు. ఎన్నికను రద్దు చేయాలని కోరారు. 

వారిని ప్రజలు ఎల్లో మీడియాగా పిలుస్తుంటారు.. 
ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొన్ని పత్రికలు, టీవీ చానళ్లను ప్రజలు ఎల్లో మీడియాగా పిలుస్తారని, తాను మాత్రం వాటికి ఏ రంగునూ ఆపాదించనని, అయితే వారికి ఓ నిర్దిష్ట రంగంటూ ఉందని చెప్పారు. కొందరు యాంకర్ల గురించి ప్రస్తావించారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. వ్యక్తుల పేర్లు అవసరం లేదని, వారిని మీడియా అంటే సరిపోతుందని అన్నారు.

అనంతరం సుధాకర్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. మెట్లపై నుంచి పడిపోతున్న వ్యక్తిని పోలీసులు లేపుతుంటే, దాన్ని ఓటు కోసం లోనికి పంపాలంటూ కాళ్లు పట్టుకున్నట్లు పిటిషనర్లు చిత్రీకరించడం సిగ్గుచేటన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు గతంలో వన భోజనాల సమయంలో తీసుకున్న ఫోటోను ఎన్నికకు ముడిపెట్టడం కోర్టును తప్పుదోవ పట్టించడమేన్నారు. ఎన్నికపై అభ్యంతరం ఉంటే వారు సహకార చట్ట నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్‌కు వెళ్లాలన్నారు. నేరుగా హైకోర్టుకు రాకూడదని చెప్పారు.  

మరిన్ని వార్తలు