వార్షికాదాయం రూ.18 వేలు..1,605 ఎకరాల్లో మైనింగ్‌

25 Aug, 2022 04:53 IST|Sakshi

త్రిశూల్‌ పేరుతో టీడీపీ నేత జేసీ బినామీల బాగోతం

డ్రైవర్లు, క్లీనర్లు, గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారు, తెల్లరేషన్‌ కార్డుదారులకు లైమ్‌స్టోన్‌ లీజులు

సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసం అనుమతి తీసుకుని ఖనిజం అమ్ముకున్నారు

అంతా అక్రమమే.. అందుకే రూ.100 కోట్ల పెనాల్టీ 

హైకోర్టుకు నివేదించిన అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

సాక్షి, అమరావతి: వార్షికాదాయం రూ.18 వేలు కూడా లేని వ్యక్తులు సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటూ 1,605 ఎకరాల్లో లైమ్‌స్టోన్‌ లీజు పొందారని, వీరంతా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి బినామీలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. త్రిశూల్‌ సిమెంట్స్‌ పేరుతో లీజుకు దరఖాస్తు చేసుకున్న వారంతా దివాకర్‌రెడ్డి వద్ద పనిచేసే తెల్లరేషన్‌ కార్డుదారులు, గ్యాస్‌ కనెక్షన్‌ లేనివారు, డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర కార్మికులేనని తెలిపింది. 2019కి ముందు టీడీపీ హయాంలో జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన అనుచరుల హవా సాగిందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు. గడువు లోగా సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడమే కాకుండా కేటాయించిన భూముల్లో తవ్వేసి ఖనిజాన్ని ఇతరులకు విక్రయించారని చెప్పారు.

త్రిశూల్‌ అంటే జేసీ దివాకర్‌రెడ్డి దృష్టిలో మోసం, అధికార దుర్వినియోగం, అవినీతి అని పేర్కొన్నారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ స్థాపిస్తామంటూ గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు కాలపరిమితి, అనుమతులు పొడిగించుకుంటూ వచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా ఖనిజ తవ్వకాలు చేపట్టి అమ్ముకున్నందుకు 13.91 లక్షల మెట్రిక్‌ టన్నులకు నిబంధనల ప్రకారం రూ.100.24 కోట్ల పెనాల్టీ చెల్లించాలని డిమాండ్‌ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. అధికారులు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని స్పష్టం చేశారు. వాదనలు విన్న హైకోర్టు ఈ వ్యవహారంలో తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

అనుమతిస్తేనే తవ్వకాలు చేపట్టాం...
అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామంలో లైమ్‌స్టోన్‌ లీజు పొందిన త్రిశూల్‌ సిమెంట్స్‌ పరిమితికి మించి ఖనిజం తవ్వి  రవాణా చేయడంపై రూ.100.24 కోట్ల పెనాల్టీ చెల్లించాలని అధికారులు 2020 మే 7న డిమాండ్‌ నోటీసు ఇచ్చారు. దీన్ని కొట్టేయాలని కోరుతూ ఆ కంపెనీ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ షేక్‌ హుస్సేన్‌ బాషా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ న్యాయవాది శివరాజు శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ త్రిశూల్‌ సిమెంట్స్‌ 2011లోనే రద్దైందని, ప్రస్తుతం అది మనుగడలో లేదన్నారు. అధికారులు అనుమతినిస్తేనే ఖనిజ తవ్వకాలు చేపట్టామన్నారు.

జాతి సంపదను దోచేశారు...
త్రిశూల్‌ సిమెంట్స్‌ అక్రమాలపై మొదటి నుంచి పోరాటం చేస్తున్న తాడిపత్రికి చెందిన ఇంప్లీడ్‌ పిటిషనర్‌ మురళీప్రసాద్‌రెడ్డి న్యాయవాది పీఎస్‌ రాజశేఖర్‌ వాదనలు వినిపిస్తూ త్రిశూల్‌ అక్రమాల పై తాము దాఖలుచేసిన పిల్‌పై హైకోర్టు ధర్మాస నం ఉత్తర్వులు జారీచేశాకే ప్రభుత్వం లీజును రద్దు చేసిందన్నారు. లక్షల టన్నుల లైమ్‌స్టోన్‌ తవ్వి జాతి సంపదను దోచుకున్నారని తెలిపారు.

గతంలో అదే ప్రాంతంలో లీజు పొందిన కంపెనీలు భూ ఉపరితలంలో ఉన్న కొండలను తవ్వితే త్రిశూల్‌ మాత్రం భూమి లోపలి ఖనిజాలను తరలించిందని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నివేదిం చారు. కంపెనీ రద్దైందని చెబుతూనే ఆ కంపెనీ పేరుమీదే ఇన్నాళ్లూ గడువు పొడిగించుకుంటూ వచ్చారన్నారు. ఈ వ్యవహారాన్ని ధర్మాసనానికి పంపాలా? తానే విచారించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొంటూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు