లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం

3 Oct, 2021 04:30 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న పూనం మాలకొండయ్య. చిత్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు

వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య

గుంటూరు జిల్లా వేజండ్లలో ఆర్బీకే తనిఖీ   

వేజండ్ల(చేబ్రోలు): రైతులు లాభసాటి వ్యవసాయం చేసేలా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్లలోని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)ను శనివారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆర్బీకేల్లో అందించే ఎరువులు, పురుగు మందులు, విత్తనాల నాణ్యతకు ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. రైతులు ఇబ్బంది పడకుండా ఏటా వైఎస్సార్‌ రైతు భరోసా కింద పెట్టుబడిని కూడా ప్రభుత్వమే అందిస్తోందని గుర్తు చేశారు. బ్యాంకర్ల ద్వారా రుణాలు కూడా అందిస్తున్నట్లు వివరించారు. రైతులు అనవసరంగా పురుగు మందులు, ఎరువులు వాడవద్దని సూచించారు.

ఆర్బీకేలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టోల్‌ ఫ్రీ నంబరు 155251 ద్వారా రైతులు సలహాలు పొందవచ్చన్నారు. రైతు సాంబిరెడ్డి మాట్లాడుతూ.. తైవాన్‌ పవర్‌ స్ప్రేయర్లను గ్రూపుల ద్వారా అందిస్తున్నారని, వ్యక్తిగతంగా రైతులకు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వెదురు బొంగుల ద్వారా వేసే కూరగాయ పందిళ్లకు గతంలో రాయితీ ఇచ్చేవారని దానిని కొనసాగించాలని కోరారు. రైతు హరికృష్ణ మాట్లాడుతూ.. కూరగాయ విత్తనాలకు సబ్సిడీ అందించాలన్నారు. రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆర్‌బీకేల్లో ఎరువుల నిల్వలను అధికంగా ఉంచాలని కోరారు.

వీటిపై పూనం మాలకొండయ్య స్పందిస్తూ.. రైతుల సూచనలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్, జేడీ జేపీ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ డీడీ ఎన్‌.సుజాత, ఏడీహెచ్‌ రాజాకృష్ణారెడ్డి, జేడీఏలు డి.శ్రీధర్, విజయభారతి, ఏడీఏ సీహెచ్‌ తిరుమలాదేవి, ఏఓ పి.సంధ్యారాణి, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బి.అనూరాధ, ఎంపీపీ కె.సాహితి, సర్పంచ్‌ జె.హైమావతి, ఎంపీటీసీ ఎస్‌.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు