చావు బతుకుల్లో పావని.. రెండు కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్‌

11 Dec, 2021 10:55 IST|Sakshi
పావనికి సపర్యలు చేస్తున్న తల్లిదండ్రులు  

వైద్యానికి ఆర్థిక స్థోమత చాలక ఇబ్బందులు

సాయం కోసం అభ్యర్థన  

ఒక కష్టం గుండె దిగక ముందే దేవుడు ఆ అమ్మాయిని మరో కొలిమిలోకి నెట్టేశాడు. అమ్మ అయ్యే క్షణం కోసం తొమ్మిది నెలలు ఎదురు చూస్తే.. పుట్టీ పుట్టగానే ఆ బిడ్డను దూరం చేశాడు. ఆ బాధ కంటి గడప దాటక ముందే ఆమె ప్రాణాన్ని ప్రమాదంలో పడేసి చోద్యం చూస్తున్నాడు. ఇరవై ఏళ్ల వయసులో రెండు కిడ్నీలు పాడైపోయి ఆ అమ్మాయి బతుకు కోసం పోరాడుతోంది. తల్లిదండ్రులు, భర్త అందరిదీ కూలి బతుకులే కావడంతో వైద్యానికి వారి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. ఆ యువతి బతకాలంటే సాయం అవసరం. గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా సమాజం నుంచి కాస్త ఆసరా ఆశిస్తున్నారు.  

వంగర: వంగర మండలం శివ్వాం గ్రామానికి చెందిన తొగరాపు త్రినాథ, పద్మల కుమార్తె పావని రెండు కిడ్నీలు కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. త్రినాథ, పద్మలు విశాఖలో కూలి పనులు చేస్తుంటారు. గత ఏడాదే బిడ్డను రణస్థలంకు చెందిన పైడిపల్లి గోవిందరావుకు ఇచ్చి వివాహం చేశారు. గోవిందరావు పైడిభీమవరంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. మూడు నెలల కిందట తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న పావనిని విశాఖలోని అగనంపూడి ప్రభు త్వ ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకెళ్లారు. కానీ ప్రసవ సమయంలోనే శిశువు మరణించింది. అమ్మ అయ్యాననే ఆనందం అనుభవించకుండానే ఆవిరైంది. 

ఆ కష్టం భరిస్తుండగానే మరో పిడుగు లాంటి వార్త వారి చెవిన పడింది. నీరసంగా ఉన్న పావనికి కిడ్నీ సమస్య ఉందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. రెండు కిడ్నీలు పోయినట్లు వైద్యులు నిర్ధారించి డయాలసిస్‌ చేపట్టారు. అనంతరం ఆమె శివ్వాంలో ఉంటున్న అమ్మానాన్న ల వద్దకు చేరుకుంది. భర్త గోవిందరావు కూడా కూ లి పనులు చేస్తూ జీవనం సాగించడంతో పావని వైద్యం కోసం వారు నానా అగచాట్లు పడుతున్నారు.  

ఇరవై ఏళ్ల వయసులో కూతురు మంచానికి పరిమితం కావడం చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కూలి పనులు చేస్తూనే ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆమె బాగోగులు చూసుకోవడానికి ఇప్పుడు ఆ పనులకు కూడా వెళ్లడం లేదు. దీంతో ఆ కుటుంబానికి ఆర్థిక భారం అధికమవుతోంది. ఇలాంటి ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే తమకు మేలు చేసిన వారవుతారని వారు కోరుతున్నారు. పింఛన్‌ కూడా ఇంకా మంజూరు కాలేదని, అధికారులు దయ చూపాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 89781 63664 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు