సంపన్న తీర హారం!

18 Sep, 2022 05:33 IST|Sakshi

కోస్తా తీరంలో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, పరిశ్రమలు 

త్వరలోనే బందరు పోర్టు సాకారం

ఆక్వా రంగం బలోపేతం 

ఎగుమతుల వాటా 10 శాతానికి పెంచడమే లక్ష్యం

ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతం 

బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి మళ్లీ మీ జిల్లాకు (కృష్ణా) వస్తా. దశాబ్దాల కలలు త్వరలోనే సాకారం కానున్నాయి. కాసేపటి క్రితమే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్న శుభవార్త వచ్చింది.
    – ఇటీవల నేతన్న నేస్తం నిధుల విడుదల సందర్భంగా పెడన సభలో సీఎం జగన్‌

నాగా వెంకటరెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కోస్తా తీరం శాశ్వత ఆదాయ మార్గంగా రూపుదిద్దుకుంటోంది. బందరు పోర్టు పూర్తైతే రూ.పది వేల కోట్లకుపైగా పెట్టుబడులతోపాటు 15 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రాథమిక అంచనా. ఏటా కనీసం 18–20 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.300 కోట్లకు మించి ఆదాయం సమకూరనుంది. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్లను వ్యయం చేస్తోంది.

ఒకవైపు ఆక్వా రంగాన్ని బలోపేతం చేస్తూ మరోవైపు పోర్టులు, హార్బర్లు, జెట్టీల నిర్మాణాలను వేగంగా చేపడుతోంది. 974 కి.మీ. పొడవైన కోస్తా తీరంలో సగటున ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుతో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశీయ ఎగుమతుల్లో ఐదు శాతంగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల వాటాను 2030 నాటికి పది శాతానికి పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నారు.

విస్తార అవకాశాలు... 
అపార అవకాశాలతో కోస్తా తీరం ప్రగతికి చిరునామాగా నిలువనుంది. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ మెరుగుపడుతోంది. కోస్తా కారిడార్, జాతీయ రహదారులు, చెన్నై– కోల్‌కతా మూడో రైలు మార్గం, నూతన విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉన్న పోర్టులతో పాటు కొత్తవీ రాబోతున్నాయి.

ఓడరేవులు, ఫిషింగ్‌ హార్బర్లు, పేరెన్నికగన్న పులికాట్, కొల్లేరు సరస్సులు, హంసలదీవి, సూర్యలంక, మైపాడు బీచ్‌లు.. ప్రముఖ ఆలయాలతో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన శ్రీహరికోటలోని రాకెట్‌ ప్రయోగశాల, గుల్లలమోద (నాగాయలంక)లో అందుబాటులోకి రానున్న మిస్సైల్‌ లాంచింగ్‌ సెంటర్, విశాఖలో నేవీ కేంద్రం... ఇలా కోస్తా తీరాన ప్రతిదీ ప్రత్యేకమే.   

పారిశ్రామిక కెరటాలు..
ఇప్పటికే ఉన్న పోర్టులకు అదనంగా మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు. కాకినాడ గేట్‌వే పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్‌ హర్బర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్‌ జూలై 20న శంకుస్థాపన చేయగా త్వరలోనే భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇదే సమయంలో ఫిషింగ్‌ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలిదశలో రూ.1,204 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరుగుతుండగా తాజాగా రూ.1,496.85 కోట్లతో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం హార్బర్ల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న విశ్వసముద్ర సంస్థ పనులను ప్రారంభించనుంది.

పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్‌ హర్బర్లు ఏర్పాటవుతుండటంతో 35 భారీ యూనిట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. వీటి ద్వారా రూ.34,532 కోట్ల పెట్టుబడులతోపాటు 72 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ తూర్పు గోదావరి జిల్లాలోనే రూ.78 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను కొనసాగిస్తోంది.

పొరుగు రాష్ట్రాలకు రవాణా మార్గం..
ఇచ్ఛాపురం నుంచి తడ వరకు ఉన్న తీర ప్రాంతం తూర్పు ఆసియా దేశాలకు ముఖద్వారం లాంటిది. ఇక్కడి పోర్టులు తెలంగాణ, కర్నాటక, ఛతీస్‌ఘడ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు సరకు రవాణాకు ఎంతో అనుకూలం. నాగ్‌పూర్‌కు సరుకు రవాణా చేయాలంటే ముంబై కంటే బందరు పోర్టు దగ్గరి దారి అవుతుంది.

నాగ్‌పూర్‌కు చెందిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ బందరు నుంచి నాగ్‌పూర్‌ మీదుగా వెళ్లే జాతీయ రహదారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తీరప్రాంతం అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పోర్టులు, హార్బర్లను అనుసంధానించేలా ఏపీ మారిటైమ్‌ బోర్డు పలు ప్రతిపాదనలను రూపొందించింది. పోర్టులను రైల్వేలు, జాతీయ రహదారులతో అనుసంధానించడం, తీరప్రాంతంలో జీవనోపాధులను మెరుగుపరచడం ద్వారా కోస్టల్‌ కమ్యూనిటి అభివృద్ధి చెందేలా ప్రతిపాదనలు పంపింది.

ఆక్వాలోనూ కింగే..
గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలతో అన్నపూర్ణగా విరాజిల్లిన ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా ఉత్పత్తుల్లోనూ మేటిగా గుర్తింపు పొందుతోంది. సీఎం జగన్‌ ఆక్వా రంగాన్ని ఆదుకుంటూ సాగుదారులపై విద్యుత్తు భారాన్ని తగ్గించారు. పదెకరాల లోపున్న ఆక్వా రైతులు యూనిట్‌ విద్యుత్తుకు రూ.1.50 మాత్రమే చెల్లించేలా ఊరట కల్పించారు. అదే టీడీపీ హయాంలో ఏకంగా రూ.3.80 చొప్పున వసూలు చేయడం గమనార్హం.

చార్జీల భారాన్ని తగ్గించడం ద్వారా మూడేళ్లలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతులకు రూ.2,400 కోట్లు మేర సబ్సిడీ కల్పించింది. అంతేకాకుండా సీడ్‌ యాక్ట్, ఫీడ్‌ యాక్ట్, ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అ«థారిటీ–20202ని తీసుకొచ్చారు. 5.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు ఈ చట్టాలు భరోసా కల్పిస్తున్నాయి.

చేపల వేటపై ఆధారపడి 8.50 లక్షల మంది మత్స్యకారులు ఉండగా ఈ రంగం ద్వారా దాదాపు 16 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆక్వా హబ్‌ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు.

రామాయపట్నం పోర్టు ఏర్పాటుతో ప్రత్యక్షంగా 7,500 మందికి, పరోక్షంగా మరో 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా. రూ.10,640 కోట్లతో దశలవారీగా 19 బెర్తులకు విస్తరించడంతో 25 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయవచ్చు. 3,773 ఎకరాలను సేకరించి 
భారీ పారిశ్రామికవాడ నెలకొల్పనున్నారు. పలు కంపెనీలు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశాయి.  

► నిర్మాణంలోని ఫిషింగ్‌ హార్బర్లు: జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ 
► పనులు ప్రారంభంకానున్న హార్బర్లు: బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, ఓడరేవు, కొత్తపట్నం

► నిర్మాణం కానున్న పోర్టులు: మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు. 
► ఉన్న పోర్టులు: విశాఖపట్నం, గంగవరం, కాకినాడ (3), కృష్ణపట్నం

సీమకూ సముద్ర తీరం
కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాయలసీమకూ సముద్రతీరం దక్కింది. తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన జిల్లా పరిధిలోకి తీర ప్రాంతాలైన కోట, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరు, సూళ్లూరుపేట మండలాలు చేరాయి. పులికాట్‌ సరస్సు కూడా కలిసొచ్చింది. 

బెస్ట్‌ వయబుల్‌ ప్రాజెక్టు
బందరు పోర్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సీఎం జగన్‌ త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, ఇండియన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ ద్వారా నిధులు అందనున్నాయి. బందరు పోర్టు బెస్ట్‌ వయబుల్‌ ప్రాజెక్టు అవుతుంది. 
– వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ   

మరిన్ని వార్తలు