బీసీ కార్పొరేషన్లతో 728 మందికి పదవులు

4 Oct, 2020 04:29 IST|Sakshi

కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా 672 మందికి అవకాశం 

56 కార్పొరేషన్‌లకు చైర్మన్‌లు.. ఈ నెల 8న ప్రకటన!

బీసీలకు నామినేటెడ్‌ పదవులు భారీ స్థాయిలో రావడం ఇదే మొదటిసారి

వీటి ద్వారా బీసీల కోసం ఏడాదికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: బీసీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ల ద్వారా 728 మంది బీసీలకు నామినేటెడ్‌ పదవులు దక్కనున్నాయి. ఈనెల 8న పదవులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించనున్నారు. మొత్తం 139 బీసీ కులాలకు గానూ ప్రస్తుతం 52 కార్పొరేషన్లు ఏర్పాటు కాగా.. మరో నాలుగు కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారయ్యాయి. వీటిలో ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. 

► 56 కార్పొరేషన్లకు గానూ 56 మంది చైర్మన్లుగా, డైరెక్టర్లుగా 672 మంది పదవులు అందుకోనున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పదవులు దక్కని కులాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటి ద్వారా న్యాయం చేయబోతోంది. 
► కులాల ప్రాతిపదికన ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే కొన్ని కులాల జనాభా 500 కంటే తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 30 వేలకు తగ్గకుండా జనాభా ఉంటే బాగుంటుందని భావించి.. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 
► ఈ కార్పొరేషన్ల ద్వారా బీసీలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీలకు అన్ని రకాల ఆర్థిక సహాయాలను ఈ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్‌ ఎండీకి ఇవ్వనుంది.  
► జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా రుణాలు పొందే అవకాశం బీసీ కార్పొరేషన్లకుంది. ఎవరి ష్యూరిటీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ష్యూరిటీతో బీసీలకు ఈ సంస్థ రుణాలిస్తుంది.

మరిన్ని వార్తలు