తపాలా.. మారుతోందిలా

31 Aug, 2021 04:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు బట్వాడా, ఆర్థిక సేవలకే పరిమితమైన పోస్టాఫీసులు.. సేవా కేంద్రాలుగా మార్పు చెందుతున్నాయి. రైల్వే టికెట్లు, బస్‌ టికెట్లు, పాస్‌పోర్టు స్లాట్‌ బుకింగ్, పాన్‌కార్డ్‌ తదితర సేవలన్నీ ఇకపై పోస్టాఫీసుల్లోనూ లభించనున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పోస్టాఫీసులను సర్వ సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు ఏపీ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డా.అభినవ్‌ వాలియా ‘సాక్షి’కి తెలిపారు. కేంద్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ సహకారంతో దాదాపు 60కి పైగా సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలోని పోస్టాఫీసుల ద్వారా 20 వరకు సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి మొబైల్, డీటీహెచ్, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, పాన్‌కార్డు, రైల్వే, బస్, విమాన టికెట్లు, పాస్‌పోర్ట్‌ కోసం స్లాట్‌ బుకింగ్, ఆర్‌టీఏ, నేషనల్‌ పెన్షన్‌ స్కీం, ఫాస్ట్‌ ట్యాగ్‌ తదితర సేవలన్నింటినీ పోస్టాఫీసుల ద్వారా అందిస్తామన్నారు. ఇందుకోసం తపాలా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని.. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీతో పాటు జిల్లా స్థాయిలో శిక్షణా కమిటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే 3,000 మంది ఆన్‌లైన్‌ సేవలపై శిక్షణ పూర్తి చేసుకున్నారని వివరించారు.

ఇప్పటివరకు 11 వేలకు పైగా సేవలు..
రాష్ట్రంలో ఇప్పటికే 1,568 పోస్టాఫీసులను సర్వ సేవా కేంద్రాలుగా మార్చినట్లు అభినవ్‌ వాలియా తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు రూ.1.26 కోట్ల విలువైన 11 వేలకు పైగా సేవలను అందించామని పేర్కొన్నారు. ప్రతి సేవకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. సెప్టెంబర్‌ నెలలో మరో 500 పోస్టాఫీసుల్లో సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. డిసెంబర్‌ నాటికి రాష్ట్రంలో ఉన్న 10,000కు పైగా పోస్టాఫీసులను సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐఆర్‌టీసీ ద్వారా రైల్వే టికెట్లు 50 చోట్ల మాత్రమే అందుబాటులోకి వచ్చాయని.. త్వరలోనే అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ విధంగా మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు