Punganur Cow: బుల్లి ఆవుకు అరుదైన గౌరవం

16 Feb, 2022 14:42 IST|Sakshi
కేంద్రం విడుదల చేసిన పుంగనూరు ఆవు బొమ్మతో కూడిన పోస్టల్‌ కవర్‌

పుంగనూరు జాతి ఆవు పేరుతో పోస్టల్‌ స్టాంప్‌ 

పుంగనూరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు జాతి ఆవులను క్రీ.శ. 610 సంవత్సరంలో గుర్తించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. బాణులు, నోళంబులు, వైదంబ చోళ ప్రభువులు పుంగనూరు ఆవును పోషించేవారు.  పుంగనూరు నుంచి తిరుపతి వరకు గల అప్పటి అభయారణ్యంలో పుంగనూరు ఆవులు అభివృద్ధి చెందాయి.

చదవండి: చుక్క గొరక.. సాగు ఎంచక్కా!

ఆవుల విశిష్టత 
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పుంగనూరు ఆవులు చిన్న అకారాన్ని కలిగి ఉంటాయి. మంచి ఔషధ గుణాలు, స్నేహపూర్వకంగా మెలుగుతాయి. ప్రపంచ దేశాల్లో ఈ ఆవు పాలకు మంచి గిరాకీ ఉంది. తెలుపు, నలుపు వర్ణాలతో ఉంటాయి. ఈ ఆవు పాలలో ఉన్న ఔషధ గుణాలు మరే పాలలోనూ లేదని బయోడైవర్సిటీ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ ఆవుల చరిత్ర, విశిష్టత గురించి మద్రాస్‌ ప్రభుత్వం అప్పట్లో గెజిట్‌ను విడుదల చేసింది. అలాగే కేఎస్‌ఎస్‌ శేషన్‌ అనే రచయిత తన పరిశోధనాత్మక పుస్తకం బ్రిటీష్‌ రోల్‌ ఇన్‌ రూరల్‌ ఎకానమీలో పుంగనూరు ప్రాంత ఆవుల గురించి జమీందారులు చేపట్టిన సంరక్షణ చర్యలను విశదీకరించారు.

రూ.70 కోట్లతో పరిశోధన కేంద్రం 
ఈ జాతి ఆవులు అంతరించిపోతుండడంతో వీటిని అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కడప జిల్లాలో రూ.70 కోట్లతో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శా ఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు జాతి ఆవుకు తగిన గుర్తింపునకు చర్యలు తీసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా పోస్టల్‌ స్టాంపు, కవర్‌ విడుదల చేయడంలో సఫలీకృతులయ్యారు. ఆవుకు జాతీయ గుర్తింపు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకతలు
ఈ ఆవులు 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది.
ఎద్దులు కూడా ఇదే పరిణామంలో ఉంటాయి.
పుంగనూరు ఆవులను దేవతా గోవులుగా పిలుస్తారు.
సాధారణ గోవు పాలలో 3 నుంచి 3.5 శాతం వరకు కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ జాతి ఆవు పాలలో 8 శాతం కొవ్వు పదార్థాలతో పాటు పూర్తిగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
ఈ జాతి ఆవులు 115 నుంచి 200 కిలోల బరువు కలిగి ఉంటుంది.
ప్రతి రోజూ ఒక ఆవు 5 కిలోల పచ్చిగడ్డిని తింటుంది.
2 నుంచి 4 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది.
ఎంత కరువు పరిస్థితులు ఎదురైనా తట్టుకుని జీవించగలవు.
లేత చర్మం, చిన్న పొదుగు, చిన్న తోక, చిట్టికొమ్ములు కలిగి నలుపు, తెలుపు వర్ణంలో ఉంటాయి. 
వీటి ధర రూ. లక్ష నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది.   

మరిన్ని వార్తలు