‘పోస్ట్‌’లో పూతరేకులు! 

23 Aug, 2021 04:32 IST|Sakshi

స్థానిక ఉత్పత్తుల ప్రచారంపై పోస్టల్‌ శాఖ దృష్టి

ఆత్రేయపురం పూతరేకులు, ధర్మవరం చీరలపై ప్రత్యేక కవర్లు విడుదల

వివిధ ఉత్పత్తుల డెలివరీకి ప్రత్యేక ఏర్పాట్లు

ఇప్పటికే ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి చీరలు డెలివరీ

పూతరేకులు వంటి ఆహార ఉత్పత్తుల డెలివరీపైనా దృష్టి

ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ అభివృద్ధి చేస్తున్న పోస్టల్‌ శాఖ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు పోస్టల్‌ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలు, చేనేత ఉత్పత్తుల పేరిట పోస్టల్‌ కవర్లు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆత్రేయపురం పూతరేకులు, ధర్మవరం చీరల ప్రత్యేకతను తెలియజేసే కవర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా వీటిని జాతీయంగా, అంతర్జాతీయంగా మార్కెటింగ్‌ చేసేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంటోంది.

ఆప్కో, లేపాక్షితో పాటు వివిధ ఆహార ఉత్పత్తుల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఏపీ సర్కిల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ కె.సుధీర్‌బాబు తెలిపారు. ఆప్కోతో ఒప్పందం ద్వారా ఇప్పటికే ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ తదితర చేనేత ఉత్పత్తులను దేశవ్యాప్తంగా డెలివరీ చేస్తున్నామని చెప్పారు. బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు తదితర ఆహార ఉత్పత్తులను కూడా వేగంగా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ముందుగా ఆత్రేయపురం పూతరేకులను సమీప ప్రాంతాలకు డెలివరీ చేసేందుకు అవసరమైన జాగ్రత్తలను పరిశీలిస్తున్నామని తెలిపారు. వీటన్నిటి కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నామని, గాంధీ జయంతి సందర్భంగా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.  

మహనీయుల పేరిట పోస్టల్‌ కవర్లు.. 
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా వివిధ రంగాల్లో సేవలందించిన మహనీయుల పేరిట ప్రత్యేక కవర్లను పోస్టల్‌ శాఖ విడుదల చేస్తోందని సుధీర్‌బాబు చెప్పారు. ఆత్మ నిర్భర్‌ భారత్, వోకల్‌ ఫర్‌ లోకల్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన 18 ఉత్పత్తులతో పాటు జీఐ కోసం దరఖాస్తు చేసుకున్న మరో 10 ఉత్పత్తులపై కూడా ప్రత్యేక తపాలా కవర్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 33 ప్రత్యేక కవర్లు విడుదల చేసినట్టు వివరించారు. రూ.20 నుంచి రూ.150 ధర ఉన్న ఈ కవర్లను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయన్నారు. దేశంలో ఇంత పెద్దఎత్తున ప్రత్యేక కవర్లను విడుదల చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని సుధీర్‌బాబు పేర్కొన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తుల పేరిట కూడా ప్రత్యేక కవర్లు విడుదల చేయడానికి పోస్టల్‌ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.  

మరిన్ని వార్తలు