సీపీఎస్‌ ఉద్యోగుల ఆందోళన వాయిదా

30 Aug, 2022 03:12 IST|Sakshi

ఒకటిన విజయవాడ రావద్దు 

స్థానిక కార్యాలయాల్లోనే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపండి

సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ వెల్లడి 

సాక్షి, అమరావతి: సీపీఎస్‌ రద్దు కోరుతూ సీపీఎస్‌ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన వాయిదా పడింది. సెప్టెంబర్‌ 1న తలపెట్టిన ఛలో విజయవాడ, మిలియన్‌ మార్చ్‌ సభ వాయిదా పడ్డాయి. పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏపీసీపీఎస్‌ఈఏ) ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబర్‌ ఒకటిన సీపీఎస్‌ ఉద్యోగులు ఎవరూ విజయవాడ రావద్దని ఆయన కోరారు. ఆ రోజు స్థానిక కార్యాలయాల్లోనే నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు. గత ఏడేళ్లుగా శాంతియుతంగానే సీపీఎస్‌ రద్దు కోసం ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. పోలీసుల అనుమతితోనే ఇప్పటివరకు వాటిని చేపట్టామన్నారు. అలాగే.. ఛలో విజయవాడ, మిలియన్‌ మార్చ్‌ పేరుతో నిర్వహించబోయే సభ, ర్యాలీకి కూడా పోలీసుల అనుమతి కోరామని తెలిపారు. కానీ, పోలీసులు ఏ నిర్ణయం చెప్పలేదన్నారు.

మరోవైపు.. తమకు సంబంధంలేని ‘సీఎం ఆఫీసు ముట్టడి’ కార్యక్రమం పేరుతో ఏపీసీపీఎస్‌ఈఏ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను అడ్డుకున్నారని, కేసులు పెట్టారని తెలిపారు. నోటీసులు, బైండోవర్లు, ముందస్తు అరెస్టులతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని పార్థసారథి పేర్కొన్నారు. దీంతో.. ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 11కి వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.   

మరిన్ని వార్తలు