ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలపై తీర్పు వాయిదా

20 Apr, 2021 04:55 IST|Sakshi

ఫలితాల వెల్లడికి అనుమతివ్వాలని ప్రభుత్వం అభ్యర్థన 

సాక్షి, అమరావతి: ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికకు సంబంధించి దాఖలైన అప్పీళ్లపై వాదనలు ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయంటూ ఏలూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

తాజాగా సోమవారం ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. తప్పుల సవరణకు సింగిల్‌ జడ్జి గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేశామన్నారు. తమ పేర్లు ఓటర్ల జాబితాలో తప్పుగా ఉన్నాయని భావిస్తే, ఆ వ్యక్తులు సంబంధిత అధికారులను ఆశ్రయించి తప్పులను సవరించుకునే వెసులుబాటు ఉందన్నారు. కానీ పిటిషనర్లు కోర్టుకొచ్చి, మొత్తం ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయించారన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి అనుమతివ్వాలని కోరారు.

శేషుకుమారి తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయన్న కారణంతో ఎన్నికలను నిలిపివేయడం సరికాదన్నారు. ఎన్నికల నిలుపుదలకు సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్‌ వేసిన చిరంజీవి తదితరుల తరఫు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. ఈ అప్పీళ్లకు విచారణార్హత లేదని, వీటిని కొట్టేయాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  

మరిన్ని వార్తలు