బ్రహ్మంగారి మఠం: తెగని పంచాయితీ, చర్చలు విఫలం

22 Jun, 2021 16:35 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పరిధిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపత్యం వివాదంలో జరపుతున్న చర్చలు విఫలమయ్యాయి. శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారి రెండు కుటుంబాల మధ్య ఎంత ప్రయత్నించినా సయోధ్య కుదరడం లేదు. పీఠాధిపత్యం విషయంలో చర్చలు కొలిక్కిరావడం లేదు. 

మఠం పీఠాధిపతి పదవికి తానే అర్హుడని వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి పట్టుడుతుండగా.. తనను మఠం మాతృశ్రీగా నియమించాలన్న రెండో భార్య మహాలక్ష్మమ్మ డిమాండ్‌ చేస్తోంది. వీరితోపాటు తనకూ ప్రాధాన్యం ఇవ్వాలంటూ మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి అంటున్నాడు. ఇదిలా ఉండగా డబ్బు, బంగారం, స్థిర, చరాస్తులు భారీగా ఉండటం, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కీర్తి ప్రతిష్టలు, మఠాధిపతిగా గౌరవం, పలుకుబడి ఉండడంతో పీఠానికి డిమాండ్‌ పెరిగింది.

నేనంటే.. నేనే
వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. పెద్ద భార్య చంద్రావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షుమ్మను వివాహమాడారు. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిద్దరూ మైనర్లు.

పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి(53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి(9)ల మధ్య పీఠాధిపత్యంలో పోటీ నెలకొంది. గోవిందస్వామి మేజర్ అయ్యేంత వరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పోటీలోకి రావడం వివాదం నెలకొంది. మారుతి మహాలక్షుమ్మకు మఠం మేనేజర్‌ ఈశ్వరయ్యతోపాటు స్థానిక విలేకరి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఐఏఎస్‌  అకాడమీ నిర్వహిస్తున్న ఆమె సమీప బంధువులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు వెంకటాద్రిస్వామికి స్థానిక ప్రజాప్రతినిధితో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులు, బద్వేలు కోర్టులో పనిచేస్తున్న మరికొందరు న్యాయవాదులు మద్దతుగా నిలిచారు.

చదవండి: శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపత్యం కోసం ఇరువర్గాల పోరు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు