Dwaraka Tirumala Broiler Farming: చికెన్‌ ధర రూ.300 దాటినా అదే తీరు.. ఇలా అయితే కష్టమే! బ్రాయిలర్‌ లాక్‌డౌన్‌?

26 May, 2022 19:22 IST|Sakshi

కార్పొరేట్‌ కంపెనీలపై కోళ్ల పెంపకం రైతుల కన్నెర్ర

తెలంగాణ రైతుల బాటలో.. ఏపీ రైతులు 

ద్వారకాతిరుమల (పశ్చిమ గోదావరి): రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్‌ కార్పొరేట్‌ కంపెనీలపై కోళ్ల పెంపకం రైతులు కన్నెర్ర చేస్తున్నారు. గ్రోయింగ్‌ చార్జీలు పెంచాలంటూ ఆందోళన బాటపడుతున్నారు. కంపెనీలతో అమీతుమీ తేల్చుకునేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా జూన్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్‌ కోళ్ల పెంపకాన్ని నిలుపుదల చేసి, లాక్‌డౌన్‌ చేపట్టాలని ఈనెల 18న కామవరపుకోటలో జరిగిన సమావేశంలో రైతులు నిర్ణయించారు.

ఏలూ రు జిల్లా ద్వారకాతిరుమల మండల రైతులు మా త్రం ఆ రోజు నుంచే లాక్‌డౌన్‌ చేపట్టి, కంపెనీలపై యుద్ధం ప్రకటించారు. భవిష్యత్‌ కార్యాచరణపై ప్రణాళికను రూపొందించేందుకు బ్రాయిలర్‌ రైతుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ జిల్లా అన్నవరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
చదవండి👉🏼 రైతు బజార్‌లో టమాట పంపిణీ ప్రారంభం    

మార్కెట్‌పై పట్టు సాధించి.. 
గతంలో రైతులు సొంత ఖర్చుతో స్వయంగా కోళ్లను పెంచి, మార్కెట్‌లో హోల్‌సేల్‌గా అమ్ముకునేవారు. క్రమంగా ఈ వ్యాపారంలోకి కార్పొరేట్‌ కంపెనీలు ప్రవేశించాయి. కోడి పిల్లలను, దాణాను, మందులను రైతులకు అందించి, వాటిని పెంచినందుకు కిలోకు రూ.4.50 గ్రోయింగ్‌ చార్జీగా చెల్లిస్తున్నాయి. మొదట్లో రైతు చెప్పిన ధరకు కోళ్లను కొని మార్కెటింగ్‌ చేసిన వ్యాపారులు, క్రమంగా మార్కెట్‌పై పట్టు సాధించి హేచరీలు, దాణా కంపెనీలతో కలిసిపోయాయి. కొన్ని హేచరీలు ఏకంగా కంపెనీలుగా మారాయి. వారి వద్ద కోడి పిల్లలు, దాణాను తీసుకుని, తిరిగి కోళ్లను వారికే అమ్మే పరిస్థితిని తెచ్చాయి.

 

చికెన్‌ ధర రూ.300 దాటినా..  
మార్కెట్‌లో కిలో చికెన్‌ ధర రూ.300 దాటినా.. కోళ్లను పెంచే రైతులకు దక్కేది మాత్రం కిలోకు రూ.4.50 మాత్రమే. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్‌ శక్తులు కోళ్ల పరిశ్రమలను గుప్పెట్లో పెట్టుకుని హోల్‌సేల్, రిటైల్‌ మార్కెట్లను శాసిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా గ్రోయింగ్‌ చార్జీలు పెంచకపోవడంతో, ఏటా వందలాది మంది రైతులు కోళ్ల పెంపకానికి స్వస్తి చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పడి, బ్రాయిలర్‌ కోళ్లు బాగా తగ్గాయి. ఇప్పుడు ఏపీలో లాక్‌డౌన్‌ చేపడితే కోళ్ల కొరతతో పాటు, చికెన్‌ ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది.  
చదవండి👉🏾 సేంద్రీయ సేద్యం.. రసాయన ఎరువులకు స్వస్తి 

కోట్లలో వ్యాపారం.. లక్షల మందికి జీవనాధారం 
రాష్ట్రంలో సుమారు 4 వేలకు పైగా బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలున్నాయి. ఒక్కో బ్యాచ్‌ నుంచి దాదాపు 3.05 కోట్లకు పైగా కోళ్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. వందల కోట్లలో జరుగుతున్న వ్యాపారంపై లక్షలాది మంది రైతులు, వ్యాపారులు, కూలీలు జీవనాధారాన్ని పొందుతున్నారు. కోడిపిల్ల వచ్చిన మొదటి రోజు నుంచి కూలీలు, వ్యాక్సిన్‌ల ఖర్చు, విద్యుత్‌ బిల్లులు, ఊక, కోళ్ల లిఫ్టింగ్‌ తదితర ఖర్చులన్నీ రైతే భరించాల్సి వస్తోంది. కోడి పిల్లలు, దాణా, మందులు, అడ్మినిస్ట్రేషన్‌ చార్జీల పేరుతో సంస్థ పెట్టిన ఖర్చులన్నీ లిఫ్టింగ్‌ సమయంలో లెక్కగడుతున్నారు. కోడి కేజీ బరువు పెరగడానికి రూ.95 మించి ఖర్చయితే ఆ భారాన్ని రైతుపైనే మోపుతున్నారు.  

ఖాళీగా ఫారాలు 
ద్వారకాతిరుమల మండలంలో మొత్తం 80 కోళ్ల ఫారాలకు గాను లాక్‌డౌన్‌ కారణంగా 70 ఫారాలు ఇప్పటికే మూతపడ్డాయి. మిగిలిన 10 ఫారాల్లోని కోళ్లను లిఫ్టింగ్‌ చేసిన తరువాత మూసివేస్తామని రైతులు చెబుతున్నారు. మూతపడ్డ కోళ్ల ఫారాల వద్ద అన్ని పరికరాలూ మూలనపడ్డాయి.  

పెట్టుబడులు కూడా రావడం లేదు 
బ్రాయిలర్‌ కోళ్ల పెంపకంతో అప్పులపాలయ్యాను. కార్పొరేట్‌ కంపెనీలు గత పదేళ్ల క్రితం నుంచి 
గ్రోయింగ్‌ చార్జీని పెంచలేదు. కూలీల ఖర్చులు, 
ఊక, విద్యుత్‌ బిల్లులు, రుణాలు, వడ్డీలు ఇతరత్రా ఖర్చులన్నీ విపరీతంగా పెరిగాయి. కంపెనీ వారు కిలోకి ఇచ్చే రూ.4.50 ఏ మూలకూ 
సరిపోవడం లేదు.   
– యలమర్తి రామకృష్ణ, రైతు, మెట్టగూడెం, ద్వారకాతిరుమల మండలం 

లాక్‌డౌన్‌ తప్పదు 
10 వేల కోడి పిల్లల బ్యాచ్‌ను పెంచడానికి రైతుకు అయ్యే పెట్టుబడి రూ.1,72,600 అయితే కంపెనీ వారు ఇచ్చేది కేవలం రూ.94,050 మాత్రమే. అంటే ఒక బ్యాచ్‌కి రైతుకు రూ.78,550 నష్టం వస్తోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించాం. గ్రోయింగ్‌ చార్జీని రూ.12కు పెంచడంతో పాటు మరో 17 డిమాండ్లను నెరవేర్చాలి.  – చిలుకూరి ధర్మారావు, బ్రాయిలర్‌ రైతు సంఘం రాష్ట్ర సభ్యుడు, ద్వారకాతిరుమల  
చదవండి👇
క్వింటాల్‌ పసుపు రూ. 6,850
ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి

 

మరిన్ని వార్తలు