ఆదాయం.. ఆరోగ్యం

11 Apr, 2022 16:11 IST|Sakshi
మహిళలకు పెరటికోళ్లు అందిస్తున్న సెర్ప్‌ అధికారులు

సెర్ప్‌ ఆధ్వర్యంలో పెరటికోళ్ల పెంపకం

స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ

పెట్టలు, పుంజులు, దాణా, మెడికల్‌ కిట్లతో యూనిట్‌

పౌష్టికాహార లోపం అధిగమిస్తూ.. ఆదాయానికి బాటలు

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: గ్రామీణ మహిళల్లో పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు ఆరోగ్యం, వారి ఆర్థిక స్థితిని పెంచేందుకు ‘పెరటి కోళ్ల పెంపకం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తోంది. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పెరటికోళ్ల పెంపకం యూనిట్లను అందజేశారు. నాటు కోళ్ల పెంపకంపై మహిళలకు శిక్షణ కూడా ఇస్తున్నారు.  

జిల్లాలో 2,566 యూనిట్లు 
జిల్లాలో పెరటి కోళ్ల పథకాన్ని సెర్ప్‌ ఈ ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 2,566 యూనిట్లను అందజేసింది. ఒక్కొక్కటి కిలో నుంచి 1,200 గ్రాములు ఉండే 8 పెట్టలు, 3 పుంజులు (జిల్లా వాతావరణానికి తట్టుకునే హసిల్‌ క్రాస్‌), 30 కిలోల దాణా, మెడికల్‌ కిట్‌ (డీవార్మింగ్, ఇమ్యునోబూస్టర్, మల్టీ విటమిన్స్, మినరల్స్, యాంటీబయాటిక్స్‌)ను ఒక యూనిట్‌గా నిర్ణయించింది. యూనిట్‌ ధర విషయానికి వస్తే కోళ్ల విలువ రూ.2,640, దాణా విలువ రూ.1,100, మెడికల్‌ కిట్‌ రూ.155, రవాణా ఖర్చు రూ.75గా మొత్తం కలిపి రూ.3,970.  

నాటు కోళ్లకు మంచి గిరాకీ 
నాటు కోళ్లకు మార్కెట్‌లో గిరాకీ ఉంది. వీటి మాంసం కిలో రూ.500 వరకు పలుకుతోంది. ఒక్కో కోడి పెట్ట ఏ డాదికి 180 గుడ్లు పెడుతుంది. సెర్ప్‌ ఇస్తున్న 8 పె ట్టల ద్వారా ఏడాదికి 1,440 గుడ్లు లభిస్తాయి. మార్కెట్లో నాటు కోడి గుడ్డు ధర రూ.8 పలుకుతోంది. ఈ గుడ్లు వెయ్యి విక్రయించినా ఏడాదికి రూ.8 వేల ఆదాయం వస్తుంది. గుడ్లను పొదిగించడం ద్వారా కోళ్ల ఉత్పత్తి పెంచుకోవచ్చు. సగటున ఏడాదికి 500 కోళ్లు అమ్మినా రూ.2.50 లక్షలు ఆదాయం పొందవచ్చు. 

ప్రయోజనం చేకూర్చే పథకం 
మహిళ ఆరోగ్యం, ఆర్థిక స్థితి పెంపునకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెరటి కోళ్ల పెంపకం చాలా మంచి పథకం. జిల్లాలో ఇప్పటి వరకు 2,566 యూనిట్లను ఏర్పాటు చేశాము. ఈ పథకం ద్వారా మహిళలు ఆదాయం పొందడమే కాకుండా పౌష్టిక విలువ అధికంగా ఉన్న నాటుకోడి గుడ్డును తినడం ద్వారా రక్తహీనత వంటి సమస్యలు తొలగి ఆరోగ్యంగానూ ఉంటారు.  
– ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్‌  

మరిన్ని వార్తలు