AP: ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు.. అంతా ఒట్టిదే: విద్యుత్‌ శాఖ

29 Aug, 2022 03:18 IST|Sakshi

సాక్షి, అమరావతి : వినాయక చవితి ఉత్సవాల పందిళ్లకు విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు విద్యుత్‌ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత పంపిణీ సంస్థల సీఎండీలు కె. సంతోషరావు, జె. పద్మాజనార్థనరెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్‌ టారిఫ్‌ను పెంచలేదని, పైగా గతంలో 250 వాట్స్‌కి కూడా రూ.వెయ్యి తీసుకునేవారని, కానీ ఇప్పుడు రూ.750గా నిర్ణయించామన్నారు.  

అప్పట్నుంచీ అవే ఛార్జీలు.. 
రాష్ట్రవ్యాప్తంగా వినాయక మండపాలకు 2014 నుంచి అమలులో ఉన్న టారిఫ్‌ ప్రకారం 500 వాట్స్‌కి రూ.1000, 1000 వాట్స్‌కి రూ.2,250, 1,500 వాట్స్‌కి రూ.3,000, 2000 వాట్స్‌కి రూ.3,750, 2,500 వాట్స్‌కి రూ.4,550, 3000 వాట్స్‌కి రూ.5,250, 3,500 వాట్స్‌కి రూ.6,000, 4000 వాట్స్‌కి రూ.6,750, 5000 వాట్స్‌కి రూ.8,250, 6,000 వాట్స్‌కి రూ.9,750, 10,000 వాట్స్‌కి రూ.15,750 చొప్పున చెల్లించి తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్లను తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ శాఖ నిబంధనల మేరకు ఈ కనెక్షన్ల ద్వారా పది రోజులపాటు విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని సీఎండీలు తెలిపారు. అవసరమైతే టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు ఫోన్‌ చేయాలని వారు కోరారు.   

మరిన్ని వార్తలు