కోటాకు మించి విద్యుత్‌ వినియోగం

14 Mar, 2023 12:25 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎండలు మండుతున్న కొద్దీ కరెంటు వినియోగం మరింతగా పెరిగింది. మార్చి మాసం తొలి పక్షం గడవక ముందే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రోజుకు 22 మిలియన్‌ యూనిట్ల కరెంటు వినియోగం జరుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయచ్చు. రానురాను ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని విద్యుత్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. వినియోగం పెరుగుతున్నా ఇప్పటివరకూ ఎక్కడా కరెంటు కోతలు లేవు. ఈ మాసంలో రోజువారీ వినియోగం దాదాపు మూడు మిలియన్‌ యూనిట్లు అదనంగా పెరిగింది.

కోటా దాటిపోయింది
ఉమ్మడి అనంతపురం జిల్లాకు నెలకు 613.986 మిలియన్‌ యూనిట్ల కోటాగా ఎస్‌పీడీసీఎల్‌ కేటాయించింది. ఈ లెక్కన రోజుకు 19.806 మిలియన్‌ యూనిట్లు మాత్రమే వినియోగం కావాలి. ఈ కోటా ఎప్పుడో దాటింది. కోటాకంటే రెండు నుంచి మూడు మిలియన్‌ యూనిట్లు ఎక్కువగా వినియోగం అవుతున్నట్టు తేలింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల మధ్య భారీగా లోడు పడుతోంది. ఏప్రిల్‌, మే నెలల్లో రోజువారీ 30 మిలియన్‌ యూనిట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోయేపరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.

వినియోగం పెరుగుతోందిలా..
ఫిబ్రవరి 15న పగలు ఓ మోస్తరు ఎండలున్నా రాత్రి పూట చలి వణికించేది. ఆ తర్వాత వాతావరణంలో మార్పు వచ్చింది. ఉక్కపోతకు తట్టుకోలేక చాలామంది ఏసీలు వేస్తున్నారు. కార్యాలయాలు, కార్పొరేట్‌ ఆఫీసుల్లో సైతం ఏసీలు మొదలయ్యాయి. ఇక ఫ్యాన్‌లు 24 గంటలూ పనిచేయాల్సిందే. దీంతో ఒక్కసారిగా గృహ వినియోగంలో రోజూ మిలియన్‌ యూనిట్లలో తేడా కనిపిస్తోంది. మరోవైపు ఎంఎస్‌ఎంఈలు, మధ్య తరహా పరిశ్రమలు పెరుగుతున్నకొద్దీ వినియోగం ఎక్కువవుతోంది. అనంతపురం జిల్లా ఉద్యానపంటలకు ప్రసిద్ధి. ఏడాది పొడవునా బోర్లు నడుస్తూనే ఉంటాయి కాబట్టి నిరంతరం కరెంటు అవసరం ఉంటుంది. దీనివల్ల కూడా కరెంటు వినియోగం జిల్లాలో ఎక్కువగా ఉంది.

మరిన్ని వార్తలు