కావాల్సినంత 'కరెంట్'‌

18 Apr, 2021 04:06 IST|Sakshi

ఈ ఏడాది కోతల్లేని సరఫరాకు విద్యుత్‌ శాఖ పక్కా ప్లాన్‌

ఈసారి కావాల్సిన విద్యుత్‌ 68,368 మిలియన్‌ యూనిట్లు

విద్యుత్‌ సంస్థలు సిద్ధం చేసినది 71,380 మిలియన్‌ యూనిట్లు

ఎంత వాడినా ఇంకా 3,012 మిలియన్‌ యూనిట్లు మిగులు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది పొడవునా విద్యుత్‌కు ఢోకా ఉండదు. కోతల్లేని సరఫరా కోసం ఇప్పటికే విద్యుత్‌ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు విద్యుత్‌ లభ్యత, డిమాండ్‌ అంచనాలను డిస్కంలు.. విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 68,368.43 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరముండగా.. 71,380.95 మిలియన్‌ యూనిట్లు లభిస్తుందని అంచనా వేశారు. ఈసారి మొత్తంగా 3,012.52 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉండబోతోంది. అక్టోబర్, నవంబర్‌లలో మాత్రం డిమాండ్‌ కన్నా 392.81 మిలియన్‌ యూనిట్ల తక్కువ విద్యుత్‌ లభిస్తోంది. ఈ రెండు నెలల్లో పవన, సౌర విద్యుదుత్పత్తి తగ్గడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. 

పక్కాగా లెక్క..
అంచనాల రూపకల్పనకు విద్యుత్‌ సంస్థలు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. గత ఐదేళ్ల డిమాండ్, లభ్యతను ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేశారు. దీని ఆధారంగా ఏ నెలలో.. ఏ ఉత్పత్తి సంస్థ ద్వారా ఎంత విద్యుత్‌ లభిస్తుంది? ఏ ప్రాంతంలో ఎంత మేర విద్యుత్‌ వాడకం ఉంటుందనే దానిపై శాస్త్రీయ కోణంలో అంచనాలు తయారు చేశారు. ఉచిత వ్యవసాయ విద్యుత్‌ విషయంలో మరింత పక్కాగా లెక్కలేశామని కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ పద్మా జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఏ సామర్థ్యంతో వాడినా పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్‌ అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. విద్యుత్‌ లోటు ఉండే అక్టోబర్, నవంబర్‌ నెలల కోసం మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలుకు ముందుస్తు వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాది పొడవునా కోతల్లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు