సింహాద్రిలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి 

4 May, 2022 03:52 IST|Sakshi
సింహాద్రి ఎన్టీపీసీ పవర్‌ ప్లాంటు

సాంకేతిక లోపమే కారణం  

పరవాడ/పెదగంట్యాడ/సీలేరు: అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలోని సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల 4 యూనిట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. 2వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సింహాద్రి ఎన్టీపీసీలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను కలపాక, గాజువాక 400 కేవీ సబ్‌స్టేషన్లకు సరఫరా చేస్తారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం వల్ల సబ్‌స్టేషన్ల లైన్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సింహాద్రి ఎన్టీపీసీలోని 4 యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన సాంకేతిక నిపుణులు.. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి కల్లా నాలుగో యూనిట్‌ నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్‌ సరఫరా జరుగుతుందని, బుధవారం ఉదయానికి మిగిలిన 3 యూనిట్ల నుంచి కూడా విద్యుత్‌ ఉత్పత్తి పునరుద్ధరణ జరుగుతుందని అధికారులు తెలిపారు.
 
హిందూజా, సీలేరులోనూ అంతరాయం 
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల సాంకేతిక లోపం తలెత్తడంతో సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలోనూ 420 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. పెందుర్తి 400 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి గ్రిడ్‌కు వెళ్లాల్సిన లైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో యూనిట్లు ట్రిప్‌ అవ్వడంతో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విశాఖ, అనకాపల్లి, పాడేరు జిల్లాల్లోని పలు చోట్ల తెల్లవారుజామున 3.15 నుంచి 5 గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యను పరిష్కరించి విద్యుత్‌ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారు. హిందుజా నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మంగళవారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో కలపాక వద్ద గల సబ్‌స్టేషన్‌లో హై ఇన్సులేషన్‌ ఫీడర్‌ ఆగిపోయింది. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.   

మరిన్ని వార్తలు