కరెంటు అంతరాయాలకు కళ్లెం

15 Feb, 2021 09:11 IST|Sakshi

సత్ఫలితాన్నిస్తున్న సర్కారు చర్యలు

ఫీడర్ల బలోపేతానికి రూ.1,700 కోట్ల కేటాయింపు

ఊరూరా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు .. లైన్ల సామర్థ్యం పెంపు

ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ..గ్రామ సచివాలయాల కీలకపాత్ర

2019–20లో 3,90,882 విద్యుత్‌ అంతరాయాలు

ఈ ఏడాది ఇప్పటివరకు 2,54,414 మాత్రమే నమోదు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. విద్యుత్‌ అంతరాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ, కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థల పరిధిలో 2019–20లో 3,90,882 విద్యుత్‌ అంతరాయాలు చోటు చేసుకుంటే, 2020–21లో ఇప్పటివరకు 2,54,414 మాత్రమే నమోదు కావడం గమనార్హం. గతంలో విద్యుత్‌ వాడకం పెరిగినా అందుకు తగ్గట్టుగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచలేదు. అలాగే గతంలో నాలుగు గ్రామాలకొక లైన్‌మ్యాన్‌ ఉండేవారు. దీంతో ఫీడర్ల పరిధిలో కరెంట్‌ పోతే లైన్‌మ్యాన్‌ వచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో అంతరాయాలు ఏర్పడేవి. అంతేకాదు అనేక సందర్భాల్లో ఈ అంతరాయాలు సుదీర్ఘ సమయం పాటు కొనసాగేవి.

‘తూర్పు’లో భారీ మార్పు
రాష్ట్రంలో ఉన్న మూడు డిస్కమ్‌లలో గ్రామీణ ప్రాంతం, గిరిజన ఆవాసాలు ఎక్కువగా ఉండే తూర్పు ప్రాంత విద్యుత్‌ సంస్థ పరిధిలో భారీ మార్పు కన్పిస్తోంది. ఈ డిస్కమ్‌ పరిధిలో గత ఏడాది 1,24,035 అంతరాయాలు ఏర్పడితే ఈ ఏడాది ఇప్పటివరకు చాలా తక్కువగా 28,663 మాత్రమే నమోదయ్యాయి. ఏళ్లనాటి విద్యుత్‌ స్తంభాలు, లైన్లు మార్చడంపై విద్యుత్‌శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అనధికారిక కనెక్షన్లు క్రమబద్ధీకరించి, లోడ్‌కు తగినట్టు మారుమూల ప్రాంతాల్లో సైతం కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యలన్నీ సరఫరాలో అంతరాయాలు తగ్గించడానికి తోడ్పడ్డాయి.

చక్కదిద్దేందుకు చర్యలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఫీడర్ల బలోపేతానికి ప్రత్యేకంగా రూ.1,700 కోట్లు కేటాయించింది. దీంతో గ్రామీణ విద్యుత్‌ సరఫరా జరిగే లైన్ల సామర్థ్యాన్ని పెంచారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో పాటు అధిక లోడ్‌ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను ఆధునీకరించారు. వాడకాన్ని తట్టుకునేలా కండక్టర్లను మార్చారు. 

ఇంధనశాఖ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇదంతా ఆన్‌లైన్‌ ద్వారానే గమనించేలా పారదర్శక విధానం తీసుకొచ్చారు. ఏ సమయంలో అంతరాయం కలిగింది? ఎంతసేపట్లో పరిష్కరించారు? అనేది తెలుసుకుంటుండటంతో సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరిగింది.

మరోవైపు గ్రామ సచివాలయ వ్యవస్థ విద్యుత్‌ అంతరాయాలు తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక్కరు చొప్పున ఇంధన సహాయకులను ఏర్పాటు చేశారు. సుశిక్షితులైన ఈ సిబ్బంది అందుబాటులో ఉండటం వల్ల అంతరాయం వచ్చిన వెంటనే వారు హాజరవుతున్నారు. అంతేగాకుండా సమస్యను గుర్తించి సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ అంతరాయం ఏర్పడకుండా నివారిస్తున్నారు.
(చదవండి: ప్రేమికుల దినోత్సవం రోజున పెళ్లి పుస్తకం)
హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది!  

>
మరిన్ని వార్తలు