కరెంటు లోడ్‌ లెక్కే మేలు

19 Apr, 2021 04:48 IST|Sakshi

పేదోడికి కరెంట్‌ బిల్లు తగ్గించే ప్రయత్నం

కనీస చార్జీలు ఎత్తేసి.. కేవీకి రూ.10 వసూలు

ఇంటింటికీ ఏటా రూ.180 ఆదా

మధ్య తరగతికి మరింత మేలు

ఐదేళ్ల తర్వాత దిగొచ్చిన కరెంట్‌ ధరలు

టీడీపీ కాలంలోనే రూ.6,549 కోట్ల బాదుడు

దొంగదెబ్బతో మరో రూ.19 వేల కోట్లు

సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్‌ సంస్థలు ఏప్రిల్‌ నుంచీ కనీస విద్యుత్‌ చార్జీలను ఎత్తేశాయి. దీని స్థానంలో కిలోవాట్‌(కేవీ) లోడ్‌కు కేవలం రూ.10 వసూలు చేస్తున్నాయి. ఈ విధానం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు విద్యుత్‌ భారం నుంచి తప్పించుకుంటారు. కరోనా కష్టకాలంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని విద్యుత్‌రంగ నిపుణులు కూడా చెబుతున్నారు.  ఈ సరికొత్త విధానం రాష్ట్రంలోని 1.50 కోట్ల వినియోగదారుల్లో 98 శాతం మందికి మేలు కలిగిస్తుంది.

పాత విధానంలో 500 కన్నా తక్కువ యూనిట్లు వాడే వినియోగదారులు నెలకు రూ.25, అంతకుమించి వాడేవారు నెలకు రూ.50 కనీస చార్జీ చెల్లించాలి. ఈ విధానాన్ని గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వినియోగదారులపై అనవసర భారం పడుతున్న ఈ విధానాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎత్తేసింది. ఇప్పుడు ఒక కిలోవాట్‌ లోడ్‌కు రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా  500 యూనిట్లలోపు విద్యుత్‌ వాడేవాళ్లకు రూ.180 (నెలకు రూ.15 చొప్పున 12 నెలలకు) ఆదా అవుతుంది. 500 యూనిట్లకుపైన వాడేవాళ్లకు రూ.480 (నెలకు రూ.40 చొప్పున 12 నెలలకు) భారం తగ్గుతుంది. 

కరెంట్‌ బిల్లులకు సర్కార్‌ కళ్లెం
రాష్ట్రంలో 95 లక్షల మంది పేద, మధ్య తరగతి వర్గాలపై గత ప్రభుత్వం భారీగా విద్యుత్‌ భారం మోపింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా రూ.6,549 కోట్ల మేర చార్జీలు పెంచింది. శ్లాబులు మార్చి మరో రూ.19 వేల కోట్లు అదనంగా వడ్డించింది. అయితే.. దీన్ని ట్రూ–అప్‌గా చూపించి కమిషన్‌ ఆమోదంతో కాలం గడిపింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఎత్తేసింది.

ప్రజలపై భారం వేసేందుకు సిద్ధంగా ఉంచిన ట్రూ–అప్‌ చార్జీలను కూడా ప్రస్తుత విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) యథాతథంగా ఆమోదించలేదు. అన్ని కోణాల్లో పరిశీలించి దాదాపు రూ.16 వేల కోట్ల అదనపు భారాన్ని తిరస్కరించింది. నిర్వహణ వ్యయాన్ని అదుపు చేయడం, అనవసరంగా అత్యధిక రేట్లకు ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలు చేయడాన్ని నివారించడం వల్ల రాష్ట్రంలో గత రెండేళ్లుగా విద్యుత్‌ చార్జీలు స్వల్పంగా తగ్గాయి. కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే గతేడాది యూనిట్‌కు 90 పైసలు పెంచారు.  

మరిన్ని వార్తలు