వాయిదాల్లో విద్యుత్‌ ఆదా పరికరాలు

16 Dec, 2021 04:20 IST|Sakshi
జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో పాల్గొన్న జస్టిస్‌ నాగార్జునరెడ్డి తదితరులు

కరెంట్‌ బిల్లులు తగ్గించడంపై  విద్యుత్‌ నియంత్రణ మండలి దృష్టి

విద్యుత్‌ ఆదా చేసే ఎలక్ట్రానిక్‌  గృహోపకరణాలను డిస్కంల ద్వారా ఇచ్చే ఏర్పాటు 

నెలవారీ విద్యుత్‌ బిల్లుల్లో పరికరాల ధరను వాయిదాలుగా చెల్లించే అవకాశం

విదేశాల్లో విజయవంతమైన ‘ఆన్‌ బిల్‌ ఫైనాన్సింగ్‌’ మోడల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ వృథాను అరికట్టి, వినియోగదారులకు బిల్లులు తగ్గించడంలో తోడ్పడడంతో పాటు ప్రజలకు, పర్యావరణానికి మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ రంగం అడుగులు వేస్తున్నాయి. తాజాగా విద్యుత్‌ పొదుపు కోసం ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నడుం బిగించింది. విదేశాల్లో విజయవంతమైన ‘ఆన్‌ బిల్‌ ఫైనాన్సింగ్‌’ విధానాన్ని రాష్ట్రానికి సరిపడేలా రూపొందించాల్సిందిగా విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కం)ను ఏపీఈఆర్‌సీ బుధవారం ఆదేశించింది. ఈ మోడల్‌ ద్వారా విద్యుత్‌ వినియోగదారులకు ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు అందజేసే  మార్గాలపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించింది. దీనిపై మూడు వారాలలోపు అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరింది. 

ఉత్పత్తి చేయలేకపోయినా ఆదా చేయగలం..
రాష్ట్రంలో  విద్యుత్‌ రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించామని ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్‌ మాట్లాడారు. ఒకరు ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి  చేయలేకపోయినా, ఒక యూనిట్‌ పొదుపు చేయగలరని, ఒక యూనిట్‌ విద్యుత్‌ పొదుపు చేస్తే 2 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్టేనని నాగార్జునరెడ్డి వివరించారు. వినియోగదారులకు నమ్మకమైన నాణ్యమైన  చౌక విద్యుత్‌ను అందజేయడం వల్ల వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తుందని, దానికోసం ఏపీఈఆర్‌సీ, విద్యుత్‌ సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. 

వినియోగదారుల ఇష్టం..
‘ఆన్‌ బిల్‌ ఫైనాన్సింగ్‌’ విధానంలో భాగంగా బ్యాంకింగ్‌ యేతర ఆర్థిక సంస్థలు, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌  లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌), వస్తు ఉత్పత్తి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. వాటి సహకారంతో వినియోగదారులకు ఇంధన సామర్థ్యం కలిగిన ఆధునిక గృహోపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటారు. అలాగే వినియోగదారులు తమ నెల వారీ విద్యుత్‌ బిల్లుల ద్వారా తాము తీసుకున్న వస్తువులకు తిరిగి చెల్లింపులు చేస్తారు.

పరికరాల వల్ల విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది కాబట్టి బిల్లులు కొంత మేర ఆదా అవుతాయి. ఫలితంగా వినియోగదారులపై వాయిదా భారం అంతగా పడదు. పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. విద్యుత్‌ సంస్థలకు సంబంధించి స్మార్ట్‌ గ్రిడ్లపై పడే అధిక లోడును కొంతమేర నివారించవచ్చని ఏపీఈఆర్‌సీ వివరించింది. అయితే ఇంధన సామర్థ్య  గృహోపకరణాలు ఉపయోగించడం అనేది వినియోగదారులు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప ఎవరినీ బలవంతం చేయడం జరగదు. అలాగే వారు చెల్లించే వాయిదాలు నేరుగా వస్తు ఉత్పత్తి దారులకు వెళతాయని మండలి స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు