విద్యుత్‌ రంగాన్ని వెంటాడుతున్న ‘బాబు’ తప్పులు.. రూ.3 వేల కోట్ల భారం

3 Aug, 2022 04:18 IST|Sakshi

అధిక ధరలకు పీపీఏల వల్ల ఏటా రూ.3 వేల కోట్ల భారం 

గత ప్రభుత్వంలో వసూలు కాని ట్రూ అప్‌ చార్జీలు రూ.20 వేల కోట్లు 

వడ్డీలు చెల్లించడానికే మరో రూ.38,836 కోట్ల రుణం 

విద్యుత్‌ సంస్థలను ఆదుకోవడానికి ఇప్పటివరకూ రూ.40 వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

చంద్రబాబు హయాంలోనే కుదేలైన విద్యుత్‌ రంగం

2014–19 మధ్య రూ.68,596 కోట్లకు చేరిన అప్పులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ అధిక ధరలకు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా.. ట్రూ అప్‌ చార్జీలపై తప్పుడు నివేదికలిచ్చి డిస్కంలను అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వ తప్పిదాలు విద్యుత్‌ రంగాన్ని ఇప్పటికీ కకావికలం చేస్తూనే ఉన్నాయి. అప్పుడు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే రూ.వేల కోట్లను డిస్కంలు వెచ్చిస్తున్నాయి. చంద్రబాబు ఘనకార్యాల వల్ల మరింత అప్పుల పాలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా ఈ పరిస్థితి నుంచి విద్యుత్‌ రంగాన్ని బయటపడేయడానికి కృషి చేస్తోంది. అనేక సంస్కరణలు, పొదుపు చర్యల ద్వారా అనవసర ఖర్చులు తగ్గించడంతో పాటు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటోంది. 

అప్పట్లోనే భారీ అప్పులు 
టీడీపీ ప్రభుత్వం హడావుడిగా 8 వేల మెగావాట్ల పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌(పీపీఏ)లను అధిక ధర (యూనిట్‌ రూ.4.84 చొప్పున)లకు కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా రూ.3 వేల కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత విలువ ఆధారంగా  ఈ మొత్తం భారం రూ.35,000 కోట్లకు పైనే. టీడీపీ హయాంలో 2014లో రూ.29,703 కోట్లు ఉన్న  విద్యుత్‌ రంగం మొత్తం అప్పులు 2019 నాటికి రూ.68,596 కోట్లకు చేరాయి. ఇవికాకుండా పవర్‌ జనరేటర్లకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుండి రూ.21,540.96 కోట్లకు పెరిగాయి.  

వడ్డీల కోసమే కొత్త అప్పు 
చంద్రబాబు మిగిల్చిన అప్పుల వల్ల ఇప్పుడు విద్యుత్‌ సంస్థలు ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి తప్పుడు నివేదికలు ఇచ్చి, విద్యుత్‌ సంస్థలు లాభాల్లోనే ఉన్నట్టు చూపించారు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లను డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా ఆ నష్టంలో కొంత పూడ్చుకుందామని డిస్కంలు ట్రూ అప్‌ చార్జీల ద్వారా చేసిన ప్రయత్నాన్నీ కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు.

ఫలితంగా రాబడికి, వ్యయానికీ మధ్య అంతరం పెరిగిపోయి, పాత అప్పులే సకాలంలో చెల్లించలేని పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం అదనంగా రూ.38,836 కోట్ల రుణాలను ఆర్థిక సంస్థల నుండి డిస్కంలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టింది. ఫలితంగా 2020–21లో ఏపీఈఆర్‌సీ ఆమోదించిన విద్యుత్‌ కొనుగోలు ఖర్చు రూ.31,346 కోట్లలో డిస్కంలు రూ.26,421 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయి. తద్వారా రూ.4,925 కోట్లు మిగిల్చాయి.

ఆదుకుంటూ.. ఆర్ధిక సాయం
రాష్ట్రంలో 22.43 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత్‌ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకూ, దోభీ ఘాట్లు, క్షౌ రశాలలు, స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల వరకూ ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. ఆక్వా రంగం అభివృద్ధి కోసం 61 వేల ఆక్వా రైతులకు సబ్సిడీ రేట్లకు విద్యుత్‌ అందిస్తోంది. వైఎస్సార్‌ జలకళ ద్వారా 6,669 బోర్‌ వెల్స్‌కు రూ.180 కోట్లు వెచ్చిస్తోంది. 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు ఉచితంగా 9 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తోంది.

రానున్న 30 ఏళ్ల వరకూ దీనిని కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. డిస్కంలపై విద్యుత్‌ కొనుగోలు భారం తగ్గించేందుకు 33,240 మెగావాట్ల సామర్థ్యం గల 29 పంప్డ్‌ స్టోరేజీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు ఆదుకోవడానికి కేవలం మూడేళ్లలోనే దాదాపు రూ.40 వేల కోట్లు సాయం అందించింది.   

మరిన్ని వార్తలు