హమ్మ తొండా.. ఎంత పనిచేశావే!

9 Jun, 2022 05:45 IST|Sakshi

వజ్రపుకొత్తూరు రూరల్‌: బుధవారం ఉదయం 8.30 గంటల సమయం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని 15 గ్రామాలకు ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఎండ వేడి ఓ వైపు.. ఉక్కపోత మరోవైపు.. వెంటనే పలువురు వినియోగదారులు విద్యుత్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. తమవైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోవడంతో.. ఐదుగురు లైన్‌మెన్లు, సచివాలయ విద్యుత్‌ సిబ్బంది రంగంలోకి దిగి లైన్లను తనిఖీ చేయడం ప్రారంభించారు.

గంట సమయం గడిచినా సమస్య ఏంటనేది మాత్రం తేలలేదు. కిడిసింగి గ్రామం నుంచి మొదలైన వీరి అన్వేషణ డోకులపాడు వరకు సాగింది. చివరకు రెండున్నర గంటల తర్వాత డోకులపాడులోని చర్చి వద్దనున్న స్తంభంపైన అసలు విషయం బయటపడింది. తీగల మధ్య ఓ తొండ చిక్కుకుపోవడాన్ని గుర్తించిన సిబ్బంది.. దాన్ని తొలగించి సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయం తెలసుకున్న స్థానికులు ‘హమ్మ తొండా.. ఎంత పని చేశావే!’ అంటూ నవ్వుకున్నారు.   

మరిన్ని వార్తలు