ఏడాదిలో కట్టేస్తాం.. చంద్రబాబు తప్పులకు డిస్కంలపై పెను భారం

27 Aug, 2022 08:12 IST|Sakshi

చంద్రబాబు ఒప్పందాలకు అసలు, వడ్డీ కడుతున్న డిస్కంలు  

ప్రస్తుతం ఈ భారం రూ.7 వేల కోట్లు 

ఎల్‌పీఎస్‌ ద్వారా 12 నెలల

వాయిదాల్లో చెల్లించనున్న డిస్కంలు 

సాక్షి, అమరావతి: స్వప్రయోజనాల కోసం గత ప్రభుత్వం చేసిన తప్పులకు నేటికీ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు కప్పం కడుతూనే ఉన్నాయి. తమకు అవసరం లేకపోయినా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు అసలు, వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బకాయి దాదాపు రూ.7 వేల కోట్లను ఏడాదిలోగా చెల్లించేస్తామంటూ ముందుకొచ్చాయి. మాట నిలబెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జ్‌ (ఎల్‌పీఎస్‌) పథకంలో చేరి 12 నెల వాయిదాల్లో ప్రతి నెలా దాదాపు రూ.600 కోట్లు చెల్లించేందుకు అంగీకరించాయి.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు నచ్చిన కంపెనీలతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. వీటికి ఫిక్సిడ్‌ చార్జీల రూపంలో యూనిట్‌కు రూ.1.1 చెల్లించాల్సి వచ్చింది. పవన విద్యుత్‌ను యూనిట్‌ ఏకంగా రూ.4.84కు తీసుకున్నారు. ఫిక్సిడ్‌ చార్జీతో కలిపి రూ.5.94 పడింది. అప్పట్లో సౌరవిద్యుత్‌ యూనిట్‌ రూ.3.54కు బదులు రూ.8.90 వెచ్చించారు. ఇలా దాదాపు ఏడువేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల మన విద్యుత్‌ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. నిజానికి రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేస్‌ ఆబ్లిగేషన్‌ (ఆర్‌పీపీవో) నిబంధనల ప్రకారం మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక విద్యుత్‌ను 5 నుంచి 11 శాతం తీసుకోవాలి. కానీ టీడీపీ ప్రభుత్వం ఏకంగా 23 శాతం పునరుత్పాదక విద్యుత్‌ను అత్యధిక ధరలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది.  

మిగులు విద్యుత్‌ వృధా చేసి.. 
2014–19 మధ్య దేశ వ్యాప్తంగాను, మన రాష్ట్రంలోను మిగులు విద్యుత్‌ ఉండేది. రాష్ట్రంలో 2015–16లో విద్యుత్‌ డిమాండ్‌ 54,225 మిలియన్‌ యూనిట్లు ఉండగా ఉత్పత్తి 54,867 మిలియన్‌ యూనిట్లు. ఆ ఏడాది 642 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మిగులుగా ఉంది. 2016–17లో 10,500 మిలియన్‌ యూనిట్లు, 2017–18లో 12,000 మిలియన్‌ యూనిట్లు, 2018–19లో 7,600 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ రాష్ట్రంలో ఉండేది. 2017–19 మధ్య రూ 2.40కు లభిస్తున్న బొగ్గు ఆధారిత ఈ మిగులు విద్యుత్‌ను బ్యాక్‌డౌన్‌ (వృధా) చేసి పీపీఏల ద్వారా అధికధరలు చెల్లించి కొనుగోలు చేశారు. 

భవిష్యత్‌లో ఇలాంటి భారం లేకుండా.. 
చంద్రబాబు గద్దెదిగేటప్పుడు రూ.2,300 కోట్ల పీపీఏ బకాయిలను కొత్త ప్రభుత్వానికి అంటగట్టి వెళ్లారు. భారీ ధరలకు పీపీఏలు ఉండటంతో వాటిని సవరించాలంటూ డిస్కంలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అప్పుడు యూనిట్‌కి రూ.2.43 పైసల చొప్పున ప్రస్తుతానికి చెల్లించమని చెప్పిన కోర్టు తుది తీర్పులో ఒప్పందం మేరకు ఇమ్మని చెప్పింది. దీంతో పీపీఏ ప్రకారం చెల్లించాల్సిన ధరకు, చెల్లిస్తున్న ధరకు మధ్య వ్యత్యాసం ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుతం చెల్లించాల్సిన పీపీఏ బకాయిలు వడ్డీతో కలిపి రూ.ఏడువేల కోట్లకు చేరాయి. ఈ మొత్తాన్ని ఏడాదిలోగా నెలవారీ వాయిదాల్లో కట్టేస్తామని డిస్కంలు ప్రకటించాయి. ఇలాంటి పరిస్థితి భవిష్యత్‌లో రాకూడదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో యూనిట్‌ కేవలం రూ.2.49 పైసల ధరకే ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.

మరిన్ని వార్తలు