పోలవరం పనులపై పీపీఏ సంతృప్తి

21 Dec, 2020 04:42 IST|Sakshi
ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న పీపీఏ అధికారులు

ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తాం 

వేగంగా పూర్తయ్యేలా సంపూర్ణ సహకారం: పీపీఏ చైర్మన్‌ 

సాక్షి, అమరావతి, పోలవరం రూరల్‌: పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, షెడ్యూల్‌ ప్రకారమే ప్రాజెక్టు పూర్తవుతుందని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ తెలిపారు. ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో కేంద్రం ఇటీవల రూ.2,234 కోట్లను రీయింబర్స్‌ చేసిందని చెప్పారు. మరో రూ.480 కోట్ల రీయింబర్స్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టును 2021 డిసెంబర్‌లోగా పూర్తి చేయడానికి సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌ నుంచి పీపీఏ అధికారుల బృందంతో కలిసి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన ఆదివారం రోజు స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) గ్యాప్‌–1, గ్యాప్‌–3 పనులు, కుడి, ఎడమ అనుసంధానాలు(కనెక్టివిటీస్‌) పనులను క్షుణ్నంగా పరిశీలించారు. స్పిల్‌ వేకు గేట్ల బిగింపు ప్రక్రియను నిశితంగా గమనించారు. గేట్ల బిగింపు, ఆర్మ్‌ గడ్డర్స్, క్రాస్‌ గడ్డర్స్, స్కిన్‌ పేట్లను అమర్చి వెల్డింగ్‌ చేస్తుండటాన్ని పరిశీలించి పనుల నాణ్యంగా చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. మే ఆఖరు కల్లా స్పిల్‌ వే పూర్తవుతుందన్నారు. స్పిల్‌ ఛానల్‌తో నీటి తోడివేత ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మే ఆఖరుకు ఈ పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1లో కాంక్రీట్‌ డ్యామ్, గ్యాప్‌–3లో డయా ఫ్రమ్‌ వాల్‌ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  
 
నేడు పునరావాస పనుల పరిశీలన.. 
పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పన పనులను క్షేత్రస్థాయిలో పీపీఏ బృందం పరిశీలిస్తుందని చెప్పారు. నాలుగు రోజులపాటు పర్యటిస్తామన్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపైనే కాఫర్‌ డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్‌ పనులు ఆధారపడ్డాయన్నారు. పునరావాసం కల్పన పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చేస్తోందన్నారు. సోమవారం వీటిని పరిశీలిస్తామని చెప్పారు. గోదావరికి వరదలు వచ్చేలోగా కాఫర్‌ డ్యామ్‌లు పూర్తవుతాయన్నారు. వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించి ఈసీఆర్‌ఎఫ్‌ పనులను నిర్విఘ్నంగా చేపట్టి డిసెంబర్‌కు పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. అయ్యర్‌ వెంట పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నాగిరెడ్డి తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు