కుక్కునూరులో పీపీఏ బృందం పర్యటన

4 Mar, 2021 04:44 IST|Sakshi
ముంపు గ్రామాల మ్యాప్‌ను పరిశీలిస్తున్న పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారులు

పోలవరం నిర్వాసితులతో భేటీ, అభిప్రాయాల సేకరణ

పునరావాస కాలనీల పరిశీలన

కుక్కునూరు: పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీ అధికారుల బృందం బుధవారం పర్యటించింది. దాచారం పునరావాస కాలనీలను పరిశీలించిన బృందం కిష్టారం, మర్రిపాడు, ఉప్పేరు తదితర గ్రామాల్లోని నిర్వాసితులను కలిసి వారి అభిప్రాయాలు సేకరించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 కాంటూరు, 43, 45.7 కాంటూరు పరిధిలో ఏయే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి? 45.7 కాంటూరు కంటే ఎత్తులో ఉన్న గ్రామాలను ముంపు పరిధిలో ఎందుకు సేకరించారు? అనే విషయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల చుట్టూ నీరు చేరుతోందని, గ్రామాల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండదని, అందుకే ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారంలో చేర్చారని, నిర్వాసితులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల వచ్చిన వరదకు ముంపులో లేని గ్రామాలకు ఎంత వరకు తాకిడికి గురయ్యాయనే విషయాన్ని గ్రామస్తులు అధికారులకు చూపించారు. ఈ సందర్భంగా ముంపులో సేకరించిన గ్రామాల పక్కనే నిర్వాసిత కాలనీలు నిర్మిస్తున్నారని, రోడ్డుమార్గం ముంపులో ఉన్నప్పుడు నిర్వాసిత కాలనీలకు ఎలా వెళతారనే విషయంపై అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిర్వాసితులను అడగ్గా అడవి మార్గం గుండా మరో రహదారి ఏర్పాటు చేస్తారని అప్పటి భూ సేకరణ అధికారి చెప్పినట్లు వారు వివరించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు