ఏ ఊళ్లోనూ 50% పైగా ఎస్సీలు లేరట!

13 Jun, 2022 16:59 IST|Sakshi

ఉమ్మడి విశాఖ, విజయనగరానికి వర్తించని పీఎంఏజీవై

50% పైగా ఎస్సీలుండే గ్రామాలకు కేంద్రం రూ.21 లక్షల సాయం

రాష్ట్రంలో 11 ఉమ్మడి జిల్లాల్లోని 501 గ్రామాలకే పథకం వర్తింపు  

సాక్షి, అమరావతి: ఎస్సీ జనాభా 50 శాతానికి పైగా ఉండే గ్రామాలు ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాల్లో కనీసం ఒక్కటి కూడా లేదంట. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన (పీఎంఏజీవై) ద్వారా వెల్లడైంది. 500 మందికి పైగా జనాభా ఉండి, అందులో 50 శాతానికి పైగా ఎస్సీ జనాభా ఉండే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏజీవై పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి ఎంపికైన గ్రామాలకు కేంద్రం రూ.21 లక్షల చొప్పున నిధులిస్తుంటుంది. 

దేశంలో 2.55 లక్షల గ్రామ పంచాయతీలుండగా.. ఇందులో 19,084 గ్రామ పంచాయతీల్లో ఈ పథకం అమలవుతోంది. ఏపీలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన 11 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 501 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

2011 నాటి లెక్కల ప్రకారం.. విజయనగరం, విశాఖ జిల్లాల్లో 50% ఎస్సీ జనాభా ఉన్న గ్రామం ఒక్కటీ లేకపోవడంతో ఈ పథకానికి ఎంపిక కాలేదని అధికారులు తెలిపారు. కాగా, కేంద్రం ఈ పథకం నిబంధనలను సవరిస్తూ ఈనెల 6న రాష్ట్రాలకు లేఖ రాసింది. కనీసం 40% ఎస్సీ జనాభా ఉండే గ్రామాల్లోనూ పథకం అమలుకు అనుమతిచ్చింది.  (క్లిక్‌: రైల్వే శాఖ అద్భుతం.. కేవలం 5 గంటల్లోనే..)

మరిన్ని వార్తలు