మొసలి కన్నీరు కారుస్తున్న టీడీపీ

7 Jan, 2021 09:53 IST|Sakshi

నాడు ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేసిన టీడీపీ

హెరిటేజ్‌ కోసం సహకార పాల సొసైటీలను నాశనం చేసిన బాబు

ఆయన నిర్ణయాలకు తాళాలు వేసిన నేతలు

నేడు మొసలికన్నీరు కారుస్తున్న టీడీపీ, ఇతర పార్టీలు

ప్రస్తుతం అమూల్‌ పాల సేకరణతో లాభాల బాటలో పాడి రైతులు

ఒంగోలు డెయిరీ ఓ బ్రాండ్‌. కేవలం సేకణలోనే కాదు.. పాలతోపాటు పాల ఉత్పత్తుల్లో కమ్మని రుచులు అందించేంది. అందుకే ఒకప్పుడు  రైతు కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఒంగోలు డెయిరీ మారింది. అప్పట్లో రోజుకు 2.50 లక్షల లీటర్ల పాలు నిత్యం డెయిరీకి వస్తుండేవి. ఇలా గ్రామాల్లోని లోగిళ్లు పాడి, పంటలతో కళకళలాడాయి. అలాంటి డెయిరీని టీడీపీ నాయకులు నిలువునా నిర్వీర్యం చేశారు. కానీ నేటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం డెయిరీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తుండటంతో పాల సేకరణదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సహకార రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయోగాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు. పాడి రైతులకు లాభాలు పెంచడంతో పాటు, ప్రైవేటు డెయిరీల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి రాష్ట్రంలో అమూల్‌ సంస్థను రంగంలోకి దించారు. దీంతో పాడి రైతుల్లో ఆనందం రెట్టింపైంది. గతంలో లీటరు పాలకు కనీసం రూ. 45 కూడా వచ్చే పరిస్థితి ఉండేదు కాదు. కానీ నేడు వెన్న శాతాన్ని బట్టి రూ. 55 నుంచి రూ. 70 వరకు ధర పలుకుతుందంటే అది కేవలం అమూల్‌ వల్లే అని అందరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సీఎం చొరవతో నేడు పాడి రైతులు పాల కేంద్రాలకు పాలను తెచ్చి గుమ్మరించి మరీ వెళుతున్నారు. నాటి టీడీపీ పాల డెయిరీలను చేసిన హననాన్ని గుర్తు చేసుకొని మండి పడుతున్నారు. 

బాబు డైరెక్షన్‌.. ఒంగోలు డెయిరీ పెద్దల యాక్షన్‌  
2014కు ముందు ఒంగోలు డెయిరీ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వెలుగొందింది. కానీ ఆ తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పచ్చగా డెయిరీని నిర్వీర్యం చేయటానికి పథక రచన చేశారు. నాటి తెలుగుదేశం పార్టీ నాయకులే సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. నాడు అలా వెలగబెట్టిన నేతలు ప్రస్తుతం డెయిరీని ఆదుకోవాలంటూ గగ్గోలు పెడుతుండటంపై పాలసేకణదారులే నవ్వుకుంటున్నారు. 

రూ. 100 కోట్లకు పైగా దోపిడీ 
చల్లా శ్రీనివాసరావు చైర్మన్‌గా ఉన్నా హయాంలో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా దోచుకున్నారు. పాలతో పాటు పాలపొడినీ బొక్కి చివరకు డెయిరీని ఒట్టి పోయిన గేదెలా వదిలి వెళ్ళిపోయారు. ఆ సయంలో విసిగిపోయిన పాడి రైతులు, పశుపోషకులు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వంపై ఆందోళనలకు దిగారు.. రహదారులు స్తంభింపజేశారు. ఎమ్మెల్యేలను గృహదిగ్భంధనం చేశారు. దీంతో దిగివచ్చిన నాటి సీఎం చంద్రబాబు డెయిరీని ఆదుకోవటానికి కొత్త ఎత్తు వేశారు. అప్పు రూపంలో ప్రభుత్వ తరఫున ఏపీడీడీసీఎఫ్‌ నుంచి రూ. 35 కోట్లు రుణం ఇప్పించారు. కానీ ఆ నిధులను కూడా డెయిరీ అభివద్ధికి వెచ్చించకుండా హారతి కర్పూరంలా కరిగించే పనిలో అధికారులతో కూడిన నూతన కమిటీ మునిగిపోయింది. అందుకుగాను రుణానికి తాకట్టుగా డెయిరీకి చెందిన రూ. 58.98 కోట్ల విలువగల 8.75 ఎకరాలను తనఖా పెట్టారు. దీనికి రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆయా సందర్భాలలో ప్రకటించిన రెపోరేటు మీద 2 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. ఈ లెక్క ప్రకారం  ప్రస్తుతం ఆ రుణానికి 8.25 శాతం వడ్డీ రేటు పడుతుంది. అందుకుగాను రుణాన్ని 2020 నవంబర్‌ నుంచి నెల నెలా కంతుల వారీగా వాయిదాలు చెల్లించేవిధంగా మారటోరియం విధించారు. చివరకు అప్పులు తీరకపోగా సంస్థకు మరింత భారంగా మారింది.

17 సంవత్సరాల పాలనలో ధ్వంస రచన
ఒంగోలు డెయిరీలో ఏకఛత్రాధిపత్యంగా టీడీపీ పాలకమండలి 17 సంవత్సరాల పాటు కొనసాగింది. 2002 నుంచి 2018 వరకు టీడీపీ నాయకుడు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓగూరు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరావు ఏకైక చైర్మన్‌గా చక్రం తిప్పారు. డెయిరీని నిలువునా దోచుకుంటున్నా అటు పార్టీ, ఇటు చంద్రబాబు ప్రభుత్వం చప్పట్లు కొట్టి మరీ ప్రోత్సహించారు. చల్లా శ్రీనివాసరావును, అప్పటి ఎండీ మేడా శివరామయ్యను హైదరాబాద్‌ పిలిపించుకున్న డెయిరీని ఏవిధంగానైనా నాశనం చేయాలన్నదే లక్ష్యంగా 2014లోనే చంద్రబాబు వ్యూహం రచించారు. సహకార రంగంలో ఉన్న ఒంగోలు డెయిరీని కంపెనీ చట్టంలోకి మార్చారు. ఇక  అప్పటి నుంచే డెయిరీని దోచుకోవటం టీడీపీ పాలకమండలి ప్రారంభించింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ డెయిరీని కాపాడటానికి ఒంగోలు డెయిరీని నిర్వీర్యం చేశారు. ఆ సంగత వదిలి నేడు టీడీపీ నేతలు ఇతర రాజకీయ పార్టీలను ఏకంచేసి పోరాటం చేయటానికి సిద్ధం అవుతుండటాన్ని చూసి దొంగే...దొంగ అన్న చందంగా ఉందని అంతా నవ్వుకుంటున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు