సెల్‌ఫోన్‌ రికవరీలపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి

22 Sep, 2022 20:24 IST|Sakshi

నిత్య జీవితంలో సెల్‌ఫోన్‌ అత్యంత అవసరంగా మారింది. వినోదమే కాదు డిజిటల్‌ లావాదేవీలు, ముఖ్యమైన సమాచారం మొత్తం ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నారు. అంతటి ముఖ్యమైన సెల్‌ఫోన్‌ పోగొట్టుకుంటే సంబంధాలు ఒక్కసారిగా తెగిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌ రికవరీలపై ప్రకాశం జిల్లా పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా రికవరీని ప్రారంభించి ఇప్పటికే వేలాది ఫోన్లను బాధితులకు అందజేశారు. ఎస్పీ మల్లికాగార్గ్‌ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

బేస్తవారిపేట: సెల్‌ఫోన్‌ చోరీలు సాధారణంగా మారిపోయాయి. ఈ నేరాలు ప్రకాశం జిల్లాలో గణనీయంగా పెరిగాయి. సెల్‌ఫోన్‌ చోరీలతో పాటు వాటిని మరిచిపోయినప్పుడు అందులోని డేటా విషయంలో ఎక్కువ బాధపడాల్సిన పరిస్థితులు. బంధువులు, సన్నిహితులు, మిత్రుల ఫోన్‌ నంబర్లతో పాటు కీలకమైన డాక్కుమెంట్లు సైతం సెల్‌ఫోన్‌లోనే దాచుకోవడం సమస్యగా మారింది. అనుకోని పరిస్థితుల్లో సెల్‌ఫోన్‌ పోగొట్టుకుంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గతంలో పోలీసులు సైతం సెల్‌ఫోన్‌ రికవరీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు కాదు. సెల్‌ఫోన్‌ పోయిందంటూ పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కితే చేదు అనుభవాలను మూటగట్టుకోవాల్సి వచ్చేది. 

రాష్ట్రంలోనే తొలిసారిగా..
సెల్‌ఫోన్‌ రికవరీలపై ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేలకు వేలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన సెల్‌ఫోన్‌లు పొగొట్టుకున్న బాధితులకు సకాలంలో న్యాయం చేకూర్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నూతన సాంకేతిక వ్యవస్థతో ఫోన్లను రికవరీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1600 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మరో 1000 ఫోన్లను ఎవరు ఉపయోగిస్తున్నారో గుర్తించారు. 300 ఫోన్లు మన జిల్లాలో, 700 ఇతర రాష్ట్రాలు, జిల్లాలో ఉన్నట్లు గుర్తించి వాటిని రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

సెల్‌ఫోన్‌ వినియోగంలో ఉంటేనే.. 
సెల్‌ఫోగొట్టుకున్న వారు పేరు, చిరునామా, కాంటాక్ట్‌ నంబర్, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియపరుస్తూ ఒక ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదును ఎస్పీ పర్యవేక్షణలోని ప్రత్యేక సాంకేతిక బృందం పరిశీలనకు స్థానిక పోలీస్‌స్టేషన్‌ల నుంచి పంపిస్తారు. ఐఎంఈఐ ద్వారా ఆ సెల్‌ఫోన్‌ ఎక్కడ వినియోగిస్తున్నారో గుర్తించి రికవరీ చేస్తున్నారు. అయితే ఆ సెల్‌ఫోన్‌ వినియోగంలో ఉన్నప్పుడే రికవరీ సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు.  


ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం: మలికాగార్గ్, ఎస్పీ 

జిల్లాలో ఇప్పటి వరకు 3799 ఫిర్యాదు వచ్చాయి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు జిల్లా ఐటీ కోర్‌ టీంకు అందుతాయి. జిల్లాలో మిస్సింగ్‌ మొబైల్స్‌ను ట్రేస్‌ చేసేందుకు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకు 1600 ఫోన్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేశాం. ఫోన్‌ పోగొట్టుకున్నా లేదా మర్చిపోయినా వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫార్మాట్‌లో డేటాను పూర్తి చేసి ఇవ్వాలి. బహిరంగ ప్రదేశాల్లో దొరికిన ఫోన్లను తీసుకుని వాడడం చేయరాదు. వాటిని స్థానిక పోలీస్‌స్టేషన్‌లలో అందజేయాలి.

10 రోజుల్లోనే తెచ్చి ఇచ్చారు
నా మొబైల్‌ పోయినట్లు ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే ఎస్సై నాకు అప్పగించారు. తిరిగి రాదనుకున్న రూ. 40 వేల సెల్‌ఫోన్‌ అందడం ఎంతో సంతోషంగా ఉంది. 
– ఎన్‌ రమణారెడ్డి, సర్పంచ్, పిటికాయగుళ్ల

మరిన్ని వార్తలు