తుపాకీ పట్టిన చేతులతో మేడి పట్టిన మాజీ సైనికులు

29 Sep, 2022 19:57 IST|Sakshi

తుపాకీ పట్టిన చేతులతో మేడి పట్టిన మాజీ సైనికులు

కూరగాయలు, చేపలు, పశువుల పెంపకంతో ముందుకు..

వారితో పాటు పలువురికి ఉపాధి

వ్యవసాయంపై మక్కువతోనే కష్టమైనా పనులు చేస్తున్నామంటున్న విశ్రాంత సైనికులు  

తుపాకీ చేతపట్టి సరిహద్దు రేఖపై పహారా కాసిన వారే.. నాగలి చేతబూని పంటచేలో సేద్యం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి దేశం కోసం పరితపించిన వారే నిరంతర శ్రామికులై శ్వేదం చిందిస్తూ అన్నదాతలుగా మారారు. వేలాది మంది సైనికులు, మాజీ సైనికులకు నిలయమైన జిల్లాలో ఏళ్ల తరబడి దేశసేవలో తరించిన మాజీ సైనికులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. కష్టం మాకు లెక్కేం కాదంటూ అవిశ్రాంతంగా మండుటెండల్లో.. పంట చేలల్లో కాయకష్టం చేస్తూ గర్వంగా మీసం మెలేస్తున్నారు.  


సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జై జవాన్‌.. జై కిసాన్‌.. అన్న నినాదాన్ని సార్థకం చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ సైనికులు. జిల్లాలో దేశానికి సేవ చేసిన.. చేస్తున్న జవాన్లు వేల సంఖ్యలో ఉన్నారు. సైనికులకు పశ్చిమ ప్రకాశం పెట్టింది పేరు. ప్రధానంగా గిద్దలూరు నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సైనికులు, మాజీ సైనికులతో పోల్చుకుంటే అత్యధిక శాతం ఉన్నారు. నియోజకవర్గంలోని అర్థవీడు మండలం జిల్లాలోనే అత్యధికంగా సైనికులు, మాజీ సైనికులున్న మండలంగా గుర్తింపు పొందింది. ఆ తరువాత స్థానాల్లో కూడా గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, బేస్తవారిపేట, రాచర్ల, కంభం మండలాలున్నాయి. ఆ తరువాత స్థానాల్లో కనిగిరి నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గాలు ఉన్నాయి.   


దేశానికి సేవలందించటంలో జిల్లాకు గుర్తింపు

దేశ సేవలో వేలాది మంది జిల్లావాసులు పునీతులయ్యారు. జిల్లా వ్యాప్తంగా మాజీ సైనికులు 28 వేల మంది ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం దాదాపు 15 వేల మందికి పైగా త్రివిధ దళాల్లో పనిచేస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే సైన్యంలో పనిచేస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, పాకిస్థాన్, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ జిల్లా సైనికులు అత్యంత సాహసాన్ని కనబరిచారు. కార్గిల్‌లాంటి యుద్ధాల్లో ప్రాణాలు ఫణంగా పెట్టారు. త్రివిధ దళాల్లో 15 నుంచి 30 సంవత్సరాల వరకు సేలందించి పదవీ విరమణ చేసిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. సైనికులుగా పనిచేసిన తరువాత వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కూడా పొందే అవకాశం మాజీ సైనికులకు ఉంటుంది. అలా వెళ్లిన వారు కొంతమంది మాత్రమే ఉంటారు. మరికొంతమంది వివిధ రంగాల్లో అంటే వ్యాపారాలు, పరిశ్రమలు, ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది వ్యవసాయం మీద మక్కువతో కష్టమైనా ఇష్టంగా పనిచేస్తున్నారు.  


వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే అత్యధికంగా.. 

సైనికుడంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవనం. ఆ క్రమశిక్షణ సోమరితనాన్ని పారదోలుతుంది. జవానుగా పదవీ విరమణ చేసిన వేలాది మంది మాజీ సైనికులు విశ్రాంత జీవితాన్ని ఖాళీగా గడపకుండా.. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు. మాజీ సైనికులు ఇతర రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో వీరి సంఖ్య దాదాపు 10 వేల మంది వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వ్యవసాయ, ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. మరికొందరు పశువుల పెంపకం ప్రధాన వృత్తిగా చేసుకున్నారు. కొందరు వ్యవసాయంతోపాటు చేపల చెరువులు వేస్తూ అందులో మంచి ఫలితాలు సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.


వ్యవసాయం, చేపల పెంపకంతో.. 

ఇతని పేరు దూదేకుల మౌలాలి. రాచర్ల మండలంలోని గుడిమెట్ట కొత్తపల్లె గ్రామానికి చెందిన ఈయన 26 ఏళ్లపాటు ఆర్మీ జవానుగా పని చేసి 2018లో పదవీ విరమణ చేశారు. అనంతరం స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి వారికున్న 6.50 ఎకరాల వ్యవసాయ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. టమోటా, మిరప, బత్తాయి, పత్తి పంటలతో పాటు చేపల పెంపకం చేపడుతున్నారు. తక్కువ ఆదాయం వస్తున్నా వ్యవసాయంపై మక్కువతో పంటలు సాగుచేస్తున్నట్లు మౌలాలి చెబుతున్నారు. జత ఎడ్లతో పాటు, నాలుగు పాడి గేదెలను పెంచుకుంటున్నారు. కుటుంబంలోని అందరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ మరికొంత మందికి తన వ్యవసాయం, చేపల పెంపకం ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. 


పొలం కౌలుకు తీసుకొని.. 

రాచర్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కఠారు పూర్ణ రంగయ్య 22 ఏళ్ల పాటు మిలిటరీలో పనిచేశారు. తనకు పెన్షన్‌ వస్తున్నా, మిలిటరీ క్యాంటీన్‌లో కావాల్సిన వస్తువులు నాణ్యమైనవి, తక్కువ ధరకు వస్తున్నా సరిపెట్టుకోలేదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తనకు పొలం లేకపోయినా 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఆ పొలంలో ఒక ఎకరంలో వరి సాగుచేస్తుండగా మిగతా మూడెకరాల్లో మిర్చితో పాటు కూరగాయల సాగు చేపడుతూ శ్రమను నమ్ముకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతూ కౌలుకు తీసుకున్న పొలం అయినా ఇష్టంగా పంటలు పండిస్తున్నారు. పెట్టుబడి, కౌలు ఖర్చులు, కూలీ ఖర్చులు పోనూ ప్రతి సంవత్సరం ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. (క్లిక్ చేయండి: వెలుగులు విరజిమ్మనున్న చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌)

మరిన్ని వార్తలు