సన్నాయి ఊదలేం.. బసవన్నను ఆడించలేం  

31 Dec, 2022 16:17 IST|Sakshi

కళతప్పుతున్న ప్రాచీన సంప్రదాయ కళ

రాను..రాను అంతరించిపోతున్న గంగిరెద్దుల ఆచారం

సంక్రాంతి పండుగ నెలలోనే బసవన్నల ఆటపాటలు

ఎద్దుల పోషణ భారంగా మారిందంటూ నిట్టూర్పు 

ప్రత్యామ్నాయ ఉపాధి వైపు చూపు  

సన్నాయి, మేళతాళాలతో ఓ రాముడూ అమ్మగారికి నమస్కరించు.. అయ్యగారికి దండం పెట్టూ.. సీతమ్మా వచ్చి రాముడు పక్కన నిలబడు... లక్ష్మణా రాముడు పక్కన నిలబడు... హనుమంతూ పల్టీలు కొట్టు ఇలా ఇంటి ముంగిట వాకిట ముగ్గులలో గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బసవన్నలను ఆడిస్తూ అందరినీ ఆహ్లాదపరుస్తారు గంగిరెద్దుల వాళ్లు. సంక్రాంతి వచ్చిందంటే వీరికి మూడు నెలలు పండగే. గజ్జెలు కట్టి.. రంగురంగుల వస్త్రాలతో బసవన్నలను అలంకరించి ఊరూరా తిరుగుతూ సందడి చేస్తారు. వీరి జీవనాన్ని ఒక్కసారి పరికిస్తే మనసును బాధించే ఎన్నో కష్టాలు మన ముందు ఉంచుతారు. వారి మదిని ఒక్కసారి తడితే వారి భవిష్యత్‌ అందర్నీ కలచివేయక మానదు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న కళను వదులుకోలేక.. భారమైనా జీవితాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నారు. ఉన్న ఊరు వదిలి వందల కిలోమీటర్లు వచ్చి ఊరికి దూరంగా ఉన్న ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని బతుకు బండి లాగుతున్న వీరిని చూస్తే గుండె బరువెక్కక మానదు. 


ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా వారి జీవన విధానాన్ని తెలుసుకుందామని నగరంలోని ముంగమూరుడొంక వెళ్లాం. అక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకుని పిల్లాజెల్లాతో నివాసం ఉంటున్నారు. సుమారు 60 నుంచి 80 గుడారాలు కనిపించాయి. అక్కడున్న వారిలో పెద్దాయన బత్తుల సబ్బయ్యను కలిశాం. ‘సంప్రదాయంగా వస్తున్న ఈ కళకు ఆదరణ తగ్గిపోయింది. ఇన్నాళ్లు బసవన్నలను పట్టుకుని అందంగా సింగారించి ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేసే వాళ్లం. అలసిపోయాం. మాతో పాటు గంగిరెద్దులు కూడా అడుగులు వేయలేని పరిస్థితి. ఇక అందరం ప్రత్యామ్నాయ వృత్తులకు పోయి కడుపు నింపుకుంటున్నాం. సంకురాత్రి వచ్చిందంటే నాలుగు డబ్బులు కనిపిస్తాయి. అవి కూడా బసవన్నల పోషణకు సరిపోతాయి. మా పిల్లలు వేరే పనులకు వెళ్లి తెచ్చిన డబ్బుతో మా కడుపులు నిండుతాయి..’ అంటూ చెమర్చిన కళ్లతో చెప్పుకొచ్చాడు సుబ్బయ్య.


‘ఏడాదిలో రెండుమూడు నెలలు మాత్రమే ఉపాధి ఉండటంతో మిగతా ఏడాది అంతా గంగిరెద్దుల పోషణ గగనమవుతోంది. రానురాను సంప్రదాయ కళకు ప్రోత్సాహం కూడా సన్నగిల్లుతోంది. ఆచారాన్ని పోగొట్టలేక భారమైనా ఈడ్చుకొస్తున్నాం’ అని అంటున్నారాయన. సుమారు రూ.10 వేలు ఖర్చు చేసి గంగిరెద్దులను సింగారిస్తాం. రెండు నెలల పాటు ఊరూరా తిరిగితే దయగల మహానుభావులు చేసే దానధర్మాలతో వచ్చిన డబ్బుతో కాలం వెళ్లిపోతుంది. కొంత మంది దానం చేసిన దుస్తులను సైతం బసవన్నల అలంకరణకే వాడుకుంటాం. దాదాపు 40 ఏళ్ల పాటు గంగిరెద్దులతో తిరిగా. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడంలేదు. వైద్యానికి ఆర్థికంగా ఇబ్బంది ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నా. మాయావిడ తెల్లవారుజామునే బజారుకెళ్లి పండ్లు తీసుకొస్తది. వాటిని సైకిల్‌ రిక్షాపై వేసుకుని ఒంగోలు నగర వీధుల్లో తిరుగుతూ విక్రయిస్తున్నా. మా పిల్లలు కూడా 8వ తరగతి వరకూ చదువుకుని వేరే పనులకు వెళ్తున్నారు. మాకు సొంత గూడు అంటూ ఏమీ లేదు. ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకున్నాం. ఈ స్థలం మాది.. ఖాళీ చేయండి అంటే వేరే ప్రాంతానికి పోతాం అంటున్నాడు సుబ్బయ్య.  


గంగిరెద్దుల తరం వారికి ప్రకాశం జిల్లా పెట్టింది పేరు. జిల్లాలోని తర్లుపాడు మండలం నాగళ్లముడుపు గ్రామంలో ప్రధాన ఆచారంగా దాదాపు 500 కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. అదేవిధంగా వెలిగండ్ల మండలం గణేశునిపల్లె గ్రామంలోనూ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. వీరిని ఆధారం చేసుకుని గుంటూరు జిల్లా వినుకొండ దగ్గర ఉప్పరపాలెం, నెల్లూరు జిల్లా కొల్లపూడి, కంటేపల్లి, మనుబోలు గ్రామాల్లో ఆచారాన్ని కొనసాగిస్తున్న వారూ ఉన్నారు. పోషణ గగనం కావడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. రకరకాల వ్యాపకాలతో జీవనోపాధి పొందుతున్నారు.  


నాలుగు నెలలు శిక్షణ... 

వీరి ఆచారం ప్రకారం రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీత అని పేర్లు పెట్టుకుంటారు. కొత్తగా తీసుకొచ్చిన గిత్తలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారు. వాటికి ఆట, పాట నేర్పిస్తారు. కాళ్లు ఆడించడం.. చేతులు తొక్కడం.. నమస్కారాలు చేయడం వంటి అంశాల్లో నాలుగు నెలల పాటు తర్ఫీదు ఇస్తారు. రాముడూ ఇలా వచ్చి బాబుగారికి సలాం చేయి అంటే బసవన్నలు చేయాల్సిందే. కొత్తగా వచ్చిన గిత్తలు బెదరకుండా చూసుకుంటూనే రంగంలోకి దింపుతారు. పలిగాపులో (నోట్లో తలపెట్టడం) కూడా శిక్షణ ఇస్తారు. ఒంటి నిండా రంగురంగుల దుస్తులతో వీటిని అలంకరించడంతో మండుటెండల్లో ఇవి ఇబ్బంది పడతాయి. కొన్ని పొగరు గిత్తలైతే శివాలు ఎత్తుతాయి.    

కులపెద్దలదే తీర్పు...
ఎవరైనా తప్పు చేస్తే ముందుగా వీరి కులంలోని పెద్దలు పంచాయితీ చేస్తారు. తప్పు చేశారని రుజువైతే వారే శిక్షవేస్తారు. వారి తీర్పు శిరోధార్యం. అక్కడ కూడా న్యాయం జరగకపోతే పోలీస్‌స్టేషన్లకు వెళ్తారు.  

డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువులు... 
గంగిరెద్దుల వంశానికి చెందిన కొందరు వాటికి ఆటపాటలు నేర్పి సంక్రాంతి పండుగ నెలల్లో ప్రతి ఇంటి ముందు ప్రత్యేక అలంకరణలతో డూ..డూ బసవన్నలు చేసే విన్యాసాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. మరికొందరు ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు రాక దుకాణాల్లో, ఫ్యాక్టరీల్లో చిన్న, చిన్న పనులు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. చాలా మంది ఐదారు తరగతుల వరకూ చదువుకుని ఆర్థిక ఇబ్బందులతో ముందుకు వెళ్లలేక కూలి పనులకు వెళ్తున్నారు.  


మా కష్టాలు గుర్తించండి...

సంకురేత్రి నెల మొదలు శివరాత్రి వరకూ గంగిరెద్దులతో ఇంటింటా తిరుగుతూ బసవన్నలతో సందడి చేస్తాం. మా ఆచారం ప్రకారం అందరం ఆరు నెలలు పట్నంలో ఉంటాం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో పెళ్లిలకు మేళాలు వాయిస్తాం. ఇతర పనులకు వెళ్తాం. నాలుగు డబ్బులు సంపాదించుకుని తిరిగి వినాయక చవితికిగానీ, దసరాకుగానీ సొంతూళ్లకు వెళ్లిపోతాం. అక్కడ పొలం పనులు చేసుకుంటాం. గంగిరెద్దులకు పొలంలో వచ్చిన జొన్న, వరిగడ్డి ఆహారంగా పెడతాం. డిసెంబర్‌ మొదటి వారంలో పట్టణాలకు చేరుకుని సంకురేత్రికి ఎద్దులను ఆడించుకుంటూ జీవనం సాగిస్తాం. కొంత మంది కూలి పనులకెళ్తారు.

నేనూ, నా కుటుంబ సభ్యులు (నలుగురు) రెండు బృందాలుగా విడిపోయి రోజంతా తిరిగితే రూ.1,000 నుంచి రూ.1,500 వస్తాయి. అందులో గంగిరెద్దులకు ఆహారం పోతే మాకు అంతంత మాత్రమే మిగులుతుంది. ఆవు కంటతడి పెడితే ఇంటికి మంచిది కాదు. వాటిని కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాం. గంగిరెద్దులను ఏదైనా ఉత్సవాలకు తీసుకెళ్తే అక్కడ కచ్చితంగా సీతారాముల కల్యాణం ఉండి తీరాల్సిందే. అన్ని జాతుల వారికి కాలనీలు ఉన్నాయి. మాకు మాత్రం ఎక్కడా లేవు. పేర్నమిట్ట దగ్గర స్థలాలు ఇస్తే బాగుంటుంది. పాలకులు మా కష్టాలను గుర్తించండి.  
– బి.వీరయ్య, ఒంగోలు

మరిన్ని వార్తలు