సర్కారు వారి సత్తా..

16 Jun, 2022 16:03 IST|Sakshi

నూతన సంస్కరణలతో ఉత్తమ ఫలితాలు 

రాష్ట్రంలో ఉమ్మడి ప్రకాశం 77.77 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానం  

97.67 శాతంతో పీసీపల్లి మండలం టాప్‌ 

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ 

నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు, అత్యధిక మంది 500పైగా మార్కులతో సత్తా చాటిన వైనం  

అధికారులు, ఉపాధ్యాయుల ప్రత్యేక దృష్టితోనే ఈ ఘనత

సర్కార్‌ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభ పది పరీక్షల్లో నిరూపితమైంది. విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన సంస్కరణల ఫలితాలకు కరోనా అడ్డుపడింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు పరీక్షలు లేకుండానే పోయాయి. ఇక ఆ రెండేళ్లు చదువులు సైతం ఆన్‌లైన్‌కే పరిమితమైంది. తాజాగా కరోనా పరిస్థితులను అధిగమించి.. నూతన సంస్కరణలతో నిర్వహించిన పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు లభించాయి. ఇది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సమర్థతకు అద్దం పడుతోంది. కార్పొరేట్‌ ఫలితాలకు మించి సాధించారు. 

ప్రకాశం (పీసీపల్లి) : 588/600, 570/600, 569/600.. ఇది పదో తరగతి పరీక్షల్లో మార్కులు. ఈ ఫలితాలు సాధించింది సర్కార్‌ పాఠశాలల విద్యార్థులు. జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి çమండలం 97.67 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో 10 ప్రభుత్వ పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మంది విద్యార్థులు 500 మార్కులకుపైగా సాధించి సత్తా చాటారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించి పేద తల్లిదండ్రుల కళ్లలో సంతోషాన్ని నింపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 77.77 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. మొత్తం 826 హైస్కూళ్లు ఉండగా 41,341 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందులో 41,061 మంది పరీక్షలకు హాజరయ్యారు. 32,151 మంది ఉత్తీర్ణత సాధించారు. కనిగిరి నియోజకవర్గంలో 52 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 45 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 6 కేజీబీవీ పాఠశాలలు, 1 మోడల్‌ స్కూల్‌ ఉన్నాయి. ఇందులో హెచ్‌ఎంపాడులో 4 పాఠశాలలు, కనిగిరిలో 3 పాఠశాలలు, పీసీపల్లిలో 3 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి.   

ఉత్తమ ఫలితాలు ఇలా.. 
ప్రత్యేక తరగతులు, ప్రత్యేక ప్రణాళికలు. పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో నాణ్యమైన విద్యాబోధన అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక తరగతులు, పకడ్బందీ ప్రణాళికలతో ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించింది. ప్రతి రోజూ సాయంత్రం స్టడీ అవర్స్‌. వారాంతంలో ఆ వారంలో పూర్తయిన సిలబస్‌పై పరీక్షలు. ఏ సబ్జెక్టులో విద్యార్థులు వెనుకబడ్డారో గుర్తించి దానిపై ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే సకాలంలో సిలబస్‌ను పూర్తి చేశారు. పలు మార్లు రివిజన్‌ చేశారు. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విద్యార్థులకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేశారు. దీంతో నూటికి నూరు శాతం ఫలితాలతోపాటు మంచి మార్కులొచ్చాయి. 

పథకాలతో అండగా.. 
అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, నాడు–నేడు, జగనన్న విద్యా కానుక వంటి పథకాలతో సీఎం జగన్‌ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.  

పిల్లలను బడికి పంపుతున్న తల్లుల ఖాతాల్లో ఏటా జనవరిలో క్రమం తప్పకుండా అమ్మ ఒడి నగదు రూ.15 వేలు జమ చేస్తున్నారు.  

సరైన సౌకర్యాలు లేక పూర్తిగా శిథిలమైపోయిన పాఠశాలలను నాడు–నేడు పేరుతో మరమ్మతులు చేయించి అదనపు సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించారు.

►  ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు.  

ఒక్క తెలుగు మీడియంలోనే విద్యనభ్యసిస్తే భవిష్యత్తులో మంచి ఉన్నత చదువులు చదువుకునేందుకు అడ్డంకి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా ఇంగ్లిషు మీడియం ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులకు ముందుగా ఇంగ్లిషు మీడియంలో శిక్షణనిచ్చింది. 

ప్రత్యేక బస్సు.. 
విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనిగిరి ఆర్టీసీ డిపో అధికారులు సీఎస్‌పురం మండలంలో ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. సీఎస్‌పురం నుంచి ఏకునాపురానికి రెండు హైస్కూళ్ల విద్యార్థులను తీసుకువెళ్తుంది. చెర్లోపల్లి, అరివేముల, జంగంవారి పల్లి, చింతలపాలెం, ముండ్లపాడు, ఏకునాపురం తదితర గ్రామాల్లో చదువుతున్న 70 నుంచి 80 విద్యార్థులను స్కూలుకు సకాలంలో తీసుకువెళ్తుంది. 

ప్రత్యేక తరగతులు నిర్వహించాం  
కరోనాతో విద్యకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. పదో తరగతిలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని రాత్రి ప్రత్యేక తరగతులు ఉపాధ్యాయులతో నిర్వహించాం. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా స్టడీ అవర్స్‌ నిర్వహించడం వల్లే ఇంతటి మెరుగైన ఫలితాలు సాధించాం.  
– సుజాత, కేజీబీవీ హెచ్‌ఎం, పీసీపల్లి  

నూరుశాతం ఫలితాలు సాధించాం 
పాఠశాలలో చదువుతున్న 64 మంది పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు. అమ్మ ఒడి పథకంతో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. 99 శాతం విద్యార్థుల బడికి హాజరవుతున్నారు. 35 మంది బాల బాలికలు 500 పైన మార్కులు సాధించారు.   
– జీవీ సురేష్‌బాబు, హెచ్‌ఎం, హెచ్‌ఎంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల  

అమ్మ, నాన్న సంతోషంగా ఉన్నారు 
ఉపాధ్యాయుల బోధన, ఇచ్చిన సలహాలు సూచనలు బాగా ఉపయోగపడ్డాయి. ఇంగ్లిషు మీడియంలో కష్టపడి చదివి 588 మార్కులు సాధించాను. అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక పథకాలు బాగా ఆదుకున్నాయి. మంచి మార్కులు వచ్చినందుకు మా అమ్మ, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు.  
– గంటా నీతీష్‌రెడ్డి, హనుమంతునిపాడు ప్రభుత్వ పాఠశాల 

ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ విజయం ..
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పించడం వల్ల మేము బాగా చదువుకునేందుకు వీలైంది. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చదివించారు. వారి సహకారంతోనే 576 మార్కులు సాధించాను.  
 – కే పద్మ, శ్రీరంగా పురం, 
మోడల్‌ స్కూల్‌ కనిగిరి  

బిడ్డల చదువుకు ఆటంకం లేకుండా చేశారు.. 
నాకు ఇద్దరు బిడ్డలు. వీరిని చదివించాలంటే మా ఆర్థిక స్థోమత సరిపోక పొలం పనులకు తీసుకెళ్లే దాన్ని.  జగన్‌ సీఎం అయ్యాక  మాకు రైతు భరోసా, నా బిడ్డలను చదువుకోవడానికి అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద, విద్యాకానుక అందిస్తూ నా బిడ్డల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చేశారు.   
– అన్నెబోయిన పద్మ,ఏకునాంపురం, అశ్విని తల్లి  

బస్సు సౌకర్యం కల్పించారు  
మా గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు దాదాపు 15 కి.మీలు ఉండేది. గతంలో పాఠశాలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం ఉండేది కాదు. దీంతో వారంలో మూడు రోజులు గైర్హాజరయ్యేదాన్ని. ఇప్పుడు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో ప్రతి రోజు బడికి వెళ్లాను. పదో తరగతిలో 554 సాధించాను.  
– అన్నెబోయిన అశ్విని, ఏకునాంపురం, సీఎస్‌పురం మండలం  

ప్రైవేటు స్కూల్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరా.. 
గతంలో నేను ప్రైవేటు స్కూల్లో చదువుకున్నాను. తరువాత ప్రభుత్వ పాఠశాలలో చేరాను. మా బడిలో వసతులు బాగున్నాయి. బాగా చదువు చెప్పారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడి చదివి 554 మార్కులు తెచ్చుకున్నాను.   
– మాధవిరెడ్డి, పీసీపల్లి ప్రభుత్వ పాఠశాల  

మరిన్ని వార్తలు