భక్తుల కొంగుబంగారం.. ఇష్ట కామేశ్వరిదేవి

23 Jun, 2022 20:12 IST|Sakshi

గంజివారిపల్లె అభయారణ్యంలో వెలసిన మహిమాన్విత క్షేత్రం

అటవీశాఖ అనుమతులతో అడవిలో కష్టసాధ్య ప్రయాణం..

ప్రతిరోజు 120 మందికి మాత్రమే అమ్మవారి దర్శనం  

దట్టమైన అభయారణ్యంలో బండరాళ్ల మధ్య కుదుపులతో కూడిన ప్రయాణం. అనుక్షణం భయం, ఉత్కంఠ, ఆహ్లాదం, ఆనందం ఇవన్నీ కలగలపి చేసే యాత్రే ఇష్టకామేశ్వరీదేవి దర్శనయాత్ర. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంజివారిపల్లె బీట్‌ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన ఇష్టకామేశ్వరి దేవతను దర్శించుకోవాలంటే కొంచెం సాహసమే..  

పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): భారతదేశం మొత్తం మీద ఆ దేవి రూపాన్ని ఆ ఒక్క క్షేత్రంలో మాత్రమే దర్శించుకోగలం. అందుకే ఆ దేవి దర్శనం ఒక సాహసయాత్ర. దట్టమైన అభయారణ్యంలోని ఓ చిన్న గుహలో వెలసిన జగజ్జనని దర్శనంతో ఆ తల్లి మన ముందు సజీవంగా నిలిచిన అనుభూతినిస్తుంది. ఒకప్పుడు కేవలం కాపాలికులు, సిద్ధులు మాత్రమే సేవించిన మహామహన్విత ఇష్టకామేశ్వరిదేవి నేడు సామాన్య భక్తులు కూడా దర్శించుకోగలుగుతున్నారు.


చెంచు గిరిజనుల నివాసాల మధ్య బండరాళ్లను పేర్చి కట్టిన చిన్న మండపానికి ముందు రేకుల షెడ్డుతో సాదాసీదాగా ఉంటుంది ఇష్టకామేశ్వరి దేవీ ఆలయం. జగద్గురువులు ఆదిశంకరాచార్యులతో పాటు ఎంతో మంది సిద్ధులు అమ్మవారిని దర్శించుకుని అక్కడే సాధన చేశారని పురాణాలు చెపుతున్నాయి. ప్రసిద్ధ శ్రీశైల పుణ్యక్షేత్రంలో కొద్దిమందికి మాత్రమే తెలిసిన మహాన్విత కేత్రం ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి ఆలయం కూడా ఒకటని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఎంత గొప్ప కోరికైనా ఈ అమ్మవారిని కోరుకుంటే తీరుతుందని పురాణాల్లో నానుడి.  


ఆకట్టుకునే అమ్మవారి స్వరూపం  

చతుర్భుజాలతో, రెండు చేతులలో తామర మొగ్గలు, మరో చేతిలో శివలింగం, మరో చేతితో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లుగా ఒక యోగినిలా అర్ధనిమీలిత నేత్రాలతో జ్ఞానముద్రలో ఉన్నట్లు ఎంతో కళాత్మకంగా కనబడుతుంది ఇష్టకామేశ్వరీ అమ్మవారు. భూగర్భంలోని ఓ చిన్న దేవాలయంలో కొలువుతీరి ఉంటుంది ఇష్టకామేశ్వదేవి. కిటికీ మాదిరిగా ఉండే చిన్న ముఖద్వారం ద్వారా మోకాళ్ల మీదుగా ఒక్కరొక్కరుగా లోనికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారి దర్శనానికి ముందు మార్గమధ్యంలో వెలసి వినాయకుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం, పొంగళిని నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, బ్రమరాంభాదేవి వెలసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇక్కడ వెలి«శారని స్థల పురాణాలు చెపుతున్నాయి. 


మానవకాంతను పోలిన అమ్మవారి నుదురు 

అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరి చేత స్వయంగా బొట్టు పెట్టించటం ఇక్కడ అనవాయితీ. అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారి నుదురు రాతి విగ్రహం మాదిరిగా కాకుండా ఒక మానవ కాంత నుదుటిని తాకినట్లుగా మెత్తగా చర్మాన్ని తాకినట్లుగా ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. భక్తులు ధర్మబద్ధంగా కోరే ఏ కోరికైనా అమ్మవారు తీరుస్తారని ప్రతీతి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు ఈదన్న పేర్కొంటున్నారు. అమ్మవారికి కొందరు భక్తులు చీర, సారెలను బహూకరిస్తారని అర్చకులు పేర్కొంటున్నారు. 


సాహసోపేతమైన దర్శనయాత్ర..

నల్లమల అభయారణ్యంలో వెలసిన ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శంచుకోవాలంటే కాస్తంత సాహసం చేయాల్సిందే. ఈ యాత్ర యావత్తూ వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే టైగర్‌ రిజర్వు అటవీ ప్రాంతం కావటంతో అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి. కొంతకాలంగా ఈ యాత్ర అటవీశాఖ అనుమతులతోనే సాగుతుంది. శ్రీశైలం సమీపంలో ఉన్న శిఖరం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

శిఖరం వద్ద అటవీశాఖ అధికారులు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి అలయానికి చేరుకోవటానికి టికెట్లు బుక్‌ చేసుకుంటారు. 5 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయానికి వెళ్లే ప్రతి వ్యక్తికి రూ.1000 చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఒక్కో వాహనంలో కేవలం 8 మంది మాత్రమే వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయి. అలా మొత్తంగా రోజుకు 15 జీపులు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తారు. టికెట్లు తీసుకున్న అరగంట నుండే వాహనాలు ప్రారంభమవుతాయి. ఇలా కష్టసాధ్యమైన యాత్రను చేసే ప్రతి ఒక్కరూ తాము కోరిన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అవి తీరగానే తమ మొక్కులను తీర్చుకుంటుంటారు.  

మరిన్ని వార్తలు