సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని కాదనుకుని.. నాట్యానుబంధం..! 

19 Jan, 2021 10:21 IST|Sakshi

సాక్షి,యద్దనపూడి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్ష రూపాయల జీతంతో కూడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని దక్కించుకోవడమంటే ఆషామాషీ కాదు. కానీ, ఆమె మాత్రం తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసుకుంది. శాస్త్రీయ నృత్యంపై ఉన్న మక్కువతో ఆ దిశగా అడుగులు వేసింది. నృత్య రూపకాలపై పరిశోధన చేసి ఆధ్యాత్మిక జతులు, జావళీలకు, సామాజిక ఇతివృత్తాన్ని జోడిస్తూ నృత్య ప్రదర్శనలిస్తూ కళాభిమానుల మన్ననలు అందుకుంది. అంతటితో సరిపెట్టుకోకుండా ఆ విద్యను పదిమందికి నేర్పించేందుకు శిక్షణాలయాన్ని స్థాపించింది. ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ నృత్య కళాకారులుగా తీర్చిదిద్దుతోంది. వారితో కలిసి ప్రదర్శనలిస్తూ తాను ఇష్టంగా ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంది. నాట్యంపై మక్కువతో తనను వివాహం చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ రంగంలో నిపుణుడైన భర్తకు సైతం గురువుగా మారి నాట్యంలో శిక్షణ ఇచ్చి అతన్ని గొప్ప కళాకారునిగా తయారు చేసింది. 

ఈ యువ దంపతులిద్దరూ కలిసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నృత్య రూపకాలు ప్రదర్శిస్తూ నాట్య దాంపత్యం కొనసాగిస్తున్నారు. కళాభిమానుల ప్రశంసలు పొందుతున్నారు. వారే, యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన అద్దంకి ఆదిశేష వెంకటసుబ్రహ్మణ్యం, బాలత్రిపురసుందరి దంపతులు. తెనాలికి చెందిన చల్లా బాలత్రిపురసుందరికి చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యమంటే మక్కువ. దస్తగిరి, రంగనాయికి, చింతా రామనాథం, కేవీ సుబ్రహ్మణ్యం వంటి గురువుల వద్ద శాస్త్రీయ నృత్యం అభ్యసించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడిలో ఎంఏ కూడా చేసింది.

భావితరాలకు కూచిపూడి కళను అందించాలన్న ఆకాంక్షతో మాస్టర్‌ ఆఫ్‌ పర్ఫారి్మంగ్‌ ఆర్ట్స్‌ (ఎంపీఏ) కూడా అభ్యసించింది. ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నప్పుడు కాలేజీలో నిర్వహించిన క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఎంపికైనప్పటికీ.. నాట్యం కోసం ఆ అవకాశాన్ని కాదనుకుంది. అనంతరం కూడా నెలకు లక్ష రూపాయల వరకూ జీతమిచ్చే ఉద్యోగాలను పలు కంపెనీలు ఆఫర్‌ చేసినప్పటికీ నిస్సందేహంగా తిరస్కరించింది. ‘ఉద్యోగం చేస్తే బోలెడు మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లలో నేనూ ఒకదాన్నవుతా.. అదే నృత్యం చేస్తే అరుదైన కళాకారిణిగా మిగులుతా’ అనే భావనతో తాను ఎంచుకున్న మార్గం వైపే ముందుకు సాగింది. కళాకారిణిగా నృత్య ప్రదర్శనలు ఇస్తూనే.. 2010లో కల్యాణి కూచిపూడి ఆర్డ్స్‌ అకాడమీ పేరిట శిక్షణాలయాన్ని స్థాపించింది. శాస్త్రీయ నృత్యంలో ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మంచి కళాకారులను తయారు చేసింది. 

కళాభిమానిని భర్తగా పొంది.. కళాకారునిగా తీర్చిదిద్ది... 
యద్దనపూడి మండలం అనంతవరం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణుడు అద్దంకి ఆదిశేష వెంకటసుబ్రహ్మణ్యానికి కూడా సంప్రదాయ నృత్యమంటే ఎంతో ఇష్టం. 2019లో పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో అతని పెద్దలు అనుకోకుండా బాలత్రిపురసుందరి సంబంధం తెచ్చారు. ఆమె గురించి తెలుసుకున్న వెంకటసుబ్రహ్మణ్యం ఆనందంతో ఎగిరి గంతేశాడు. వెంటనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం కళావేదికలపై తన భార్య చేస్తున్న నృత్యానికి మరింత ఆకర్షితుడై ఎలాగైనా నాట్యం నేర్చుకోవాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తన శ్రీమతినే గురువుగా చేసుకుని నెలల వ్యవధిలోనే ఆమె వద్ద నాట్యం నేర్చుకున్నాడు. వివిధ నృత్యరూపకాల పాత్రలకు తగిన హావభావాలు పలికించడంలోనూ నేర్పు సాధించాడు. గతేడాది తిరుమలలో జరిగిన నాదనీరాజనంలో శ్రీనివాసరూప కల్యాణాన్ని భార్యతో కలిసి ప్రదర్శించాడు. మహాశివరాత్రి వేడుకల్లో శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో నిర్వహించిన శివకల్యాణం రూపకంలోనూ ఈ దంపతులిద్దరూ శివపార్వతులుగా అభినయించి అభినందనలు అందుకున్నారు. షిరిడీలో బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే బాబాగా అభినయించి అందరినీ మెప్పించాడు. భార్యభర్తలిద్దరూ కలిసి భవిష్యత్తులో మరిన్ని నృత్య ప్రదర్శనలు ఇచ్చేందుకు, తమ శిక్షణాలయం ద్వారా మరింత మందికి సంప్రదాయ నృత్యంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. 

కళామతల్లికి సేవలందించడమే లక్ష్యం : 
మా ఇద్దరికీ నాట్యమంటే ప్రాణం. రాబోయే రోజుల్లో కూడా ఇలానే మా నాట్య ప్రయాణాన్ని సాగించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. భార్యభర్తలు ఎటువంటి అరమరికలు లేకుండా ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటే ఏ రంగంలోనైనా ఇద్దరూ అద్భుత విజయాలు సాధించగలరు. మా అకాడమీ ద్వారా చిన్నారులకు నృత్యం నేరి్పస్తూ కళామతల్లికి సేవలందిస్తాం.
-బాలత్రిపురసుందరి, వెంకటసుబ్రహ్మణ్యం దంపతులు

మరిన్ని వార్తలు