‘పర్‌ఫెక్ట్‌’వల్లే శానిటైజర్‌ మరణాలు

11 Aug, 2020 14:38 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడు శ్రీనివాస్‌తో సహా 10 మందిని  సిట్‌ అధికారులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కేసు వివరాలను ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌‌ మీడియాకు వివరించారు. ఈ ఘటనకు హైదరాబాద్‌లో తయారు చేసిన ‘పర్‌ఫెక్ట్‌’సొల్యూషన్స్ శానిటైజర్లే కారణమని ఆయన తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా జీడిమెట్లలో అక్రమంగా నకిలీ శానిటైజర్లను తయ్యారు చేశారన్నారు. మిథైల్‌ క్లోరైడ్‌ను విచ్చలవిడిగా వినియోగించినట్లు విచారణలో తేలిందన్నారు. శానిటైజర్ల తయారీలో అధికారులకు చిక్కినా లంచాలు ఇచ్చి బయట  పడ్డారని తెలిపారు. ఈ నకిలీ శానిటైజర్లను బెంగళూరు, హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు నిందితులు సరఫరా చేశారని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ వెల్లడించారు. 
(చదవండి : కురిచేడు ఘటన: ఆసక్తికర విషయాలు వెలుగులోకి)

మరోవైపు ఈ కేసులో మరో నిందితుడు, శానిటైజర్ నిర్వాహకుడు సాలె శ్రీనివాస్‌ను విచారించిన సిట్‌ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. పేదరికంలో ఉన్న శ్రీనివాస్ ఆదాయంపై ఆకర్షితుడై‌ లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే శానిటైజర్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో చూసి శానిటైజర్‌ తయారు చేసి ఆ వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో పెట్టిన పదిరోజులల్లో బిజినెస్ సక్సస్ కావడం, ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో ఈ వ్యాపారాన్ని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులను కలిసి హైదరాబాద్‌ జీడిమెట్లలో పారిశ్రామికవాడ పైప్‌లైన్‌ రోడ్డులో పర్‌ఫెక్ట్‌ కెమికల్స్‌ అండ్‌ సాల్వెంట్స్‌ కంపెనీ ఏర్పాటు చేశాడు. అక్కడ తయారు చేసిన శానిటైజర్‌ని తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేయడానికి ఇద్దరు పంపిణీ దారులను నియమించుకున్నాడు. అయితే పెరిగిన ఖర్చులకు తగిన ఆదాయం రాలేదనే కారణంతో ఇథైల్‌ ఆల్కాహాల్‌కు బదులుగా మరో ద్రావణాన్ని కలిపి విక్రయించాడు. అదే పరిస్థితుల్లో శ్రీనివాస్ కరోనా బారిన పడటంతో, ఆ బాధ్యతలను తన తమ్ముడికి అప్పగించాడు. ఇంతలో కురిచేడు ఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన చెంది విజయవాడలోని తన మిత్రుడి నివాసంలో శ్రీనివాస్ తలదాచుకోగా.. అతడి ఆచూకీని తెలుసుకున్న సిట్ బృందం అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు