హైకోర్టు తీర్పులను తెలుగులోకి అనువదిస్తాం 

27 Jan, 2023 04:46 IST|Sakshi
హైకోర్టు ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించిన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా

గణంతంత్ర వేడుకల్లో హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా 

సాక్షి, అమరావతి: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ చంద్రచూడ్‌ చేపడుతున్న సంస్కరణలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర హైకోర్టు ఇచ్చే తీర్పులను తెలుగులోకి అనువదించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా చెప్పారు. న్యాయవ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా అత్యంత కీలకమైన రికార్డుల డిజిటలైజేషన్‌ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.  

కేసులను వర్గీకరించడం, ఒకే తరహా కేసులను గుర్తించడం, తాజాగా దాఖలైన వ్యాజ్యాల వంటివి గతంలో దాఖలై ఉంటే అందులో కోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తించడం వంటి వాటికోసం ఏఐను వాడుకుంటామని చెప్పారు. దీనివల్ల విచారణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని, కక్షిదారులకు సత్వర న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత అందరి భాగస్వామ్యంతో ఏపీ హైకోర్టును మరింత బలోపేతం చేసేదిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హైకోర్టులో గురువారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్‌ మిశ్రా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల హక్కులను పరిరక్షించడంలో భారత న్యాయవ్యవస్థ ముందువరుసలో ఉందన్నారు. సత్వర న్యాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ అసెంబ్లీ సభ్యులైన తన తాతకు సహాయకుడిగా సమరయోధులతో జరిగే ఇష్టాగోష్టులకు వెళ్లే అవకాశం తనకు దక్కిందని తెలిపారు.

అప్పుడే రాజ్యాంగం గొప్పతనం అర్థమైందన్నారు. హైకోర్టు, దిగువ కోర్టుల్లో ఖాళీలు భర్తీచేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామన్నారు. రాబోయే మూడునెలల్లో హైకోర్టులో 14 కోర్టు హాళ్లు అందుబాటులోకి రానున్నాయని, కొత్తగా నిర్మిస్తున్న భవనంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, లక్ష పుస్తకాలతో పాటు విదేశీ జర్నల్స్‌ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

అంతకుముందు రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు తదితరులు ప్రసంగించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి సతీమణులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు