గగుర్పాటు కలిగించే ‘గ్యాంగ్‌స్టర్‌’ చీకటి కోణం.. కానీ ఇప్పుడు..

10 Aug, 2022 08:29 IST|Sakshi
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆనం కళాకేంద్రంలో యోగాసనాలు వేస్తున్న ప్రతాప్‌ సింగ్‌

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం)/తూర్పుగోదావరి: ప్రతాప్‌సింగ్‌.. ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్‌.. షార్ప్‌ కిల్లర్‌ కూడా. జైలు జీవితం అతడిలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. పరివర్తన చెందిన అతడు ఇప్పుడు యోగా గురువుగా మారి ఎందరికో యోగా నేర్పుతూ.. తనలా ఎవరూ కాకూడదనే సందేశాన్ని ఇస్తున్నాడు. అతడి గతాన్ని పరికిస్తే.. ఉత్తరాఖండ్‌లోని ఫితోడ్‌ గఢ్‌ గ్రామంలోని ఉన్నత కుటుంబంలో జన్మిచాడు ప్రతాప్‌సింగ్‌. తండ్రి ఆర్మీ అధికారి. అన్న కూడా ఆర్మీలో చేరి అధికారి స్థాయికి ఎదిగాడు. తాను కూడా ఆర్మీలో చేరాలని ప్రతాప్‌సింగ్‌ కలలుకన్నా నెరవేరలేదు.
చదవండి: అమెరికా అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి నిశ్చితార్థం 

పోలియో వల్ల వచ్చిన అవిటితనం కారణంగా కలని నెరవేర్చుకోలేకపోయాడు. దానికి తోడు సవితి తల్లి సూటిపోటి మాటల్ని భరించలేక ఇంటినుంచి పారిపోయి చిన్నతనంలోనే ఢిల్లీ చేరుకున్నాడు. ఓ గ్యాంగ్‌స్టర్‌ వద్ద చేరి 15 సంవత్సరాలకే దోపిడీలు, కిడ్నాప్‌లు చేశాడు. ప్రతాప్‌ సింగ్‌ గ్యాంగ్‌ ఆగడాల కారణంగా ఢిల్లీ కల్యాణ్‌పూర్‌లో అడుగుపెట్టాలంటే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎవరినైనా చంపాలనుకుని సుపారీ తీసుకుంటే వారికి చావు మూడినట్టే. అతీ సమీపానికి వెళ్లి గురి చూసి కాల్చి చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న తరువాతే ఆ గ్యాంగ్‌ అక్కడ నుంచి వెళ్తుందనే పేర్కొంది. 

జైలులోనే పరివర్తన
పదహారు హత్య కేసులతో సంబంధం ఉన్న ప్రతాప్‌సింగ్‌ ఏలూరు జిల్లా పినకడిమిలో జరిగిన హత్య కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. 2017లో ఖైదీలలో పరివర్తన తీసుకుని రావడానికి ప్రణవ సంకల్ప సమితి ఆధ్వర్యంలో యోగా నేర్పించారు. అందులో ఇంటర్మీడియెట్, టెన్త్‌ చదివిన 30 మందిని ఎంపిక చేశారు. 6వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ప్రతాప్‌సింగ్‌ తాను యోగా నేర్చుకుంటానని పట్టుపట్టడంతో అతడికీ యోగా నేర్పించారు. 9 నెలల శిక్షణలో ధ్యానం, జపం నేర్చుకుని పరివర్తన చెందాడు.

చెడు మార్గాన్ని వీడి నూతన జీవితం వైపు ప్రయాణిస్తానని, తిరిగి ఎప్పుడూ అటూవైపు వెళ్లనని దృఢంగా నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే శిక్షా కాలం పూర్తయ్యాక నలుగురికీ యోగా నేర్పుతూ అదర్శప్రాయంగా ఉంటున్నాడు. గుంటూరులో కలెక్టర్‌ తన యోగా విన్యాసాలను చూసి మెచ్చుకున్నారని.. తాను గ్యాంగ్‌స్టర్‌ని అయినా.. తనలో వచ్చిన మార్పు చూసి కలెక్టర్‌ మెచ్చుకోవడం కంటే సంతృప్తి తనకు ఏముంటుందని ప్రతాప్‌సింగ్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

అనర్థాలను వివరిస్తూ..
ఇప్పుడు యోగా శిక్షకుడుగా పలువురికి యోగా నేర్పుతూ తనలా ఎవరి జీవితం చీకటి కోణంలోకి వెళ్లకూడదని ప్రతాప్‌సింగ్‌ హితవు చెబుతున్నాడు. యోగాతోపాటు చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పలువురిలో పరివర్తన తీసుకొస్తున్నాడు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల వేళ రాజమహేంద్రవరంలోని అనం కళా కేంద్రంలో మంగళవారం ప్రణవ యోగ సంకల్ప సమితి వ్యవస్థాపకుడు పతంజలి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో యోగా గురువులను సత్కరించారు. ఇదే కార్యక్రమంలో ప్రతాప్‌సింగ్‌ను నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ సన్మానించారు.  

మరిన్ని వార్తలు