‘ఉక్రెయిన్‌ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకువస్తాం’

26 Feb, 2022 19:17 IST|Sakshi

న్యూడిల్లీ: ఉక్రెయిన్‌ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలిస్తామని ఢిల్లీలోని ఏపీ భవన్‌​ ప్రిన్స్‌పాల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు. ఈ రాత్రి(శనివారం)కి ప్రత్యేక విమానంలో కొద్దిమంది విద్యార్థులు వస్తున్నారని చెప్పారు. ఢిల్లీలో నాలుగు  బృందాలను ఏర్పాటు చేసి సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టుకు చేరుకునే విద్యార్థులను రిసీవ్‌ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఏపీ ప్లకార్డులు పట్టుకుని అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో సిద్ధంగా ఉంటారని చెప్పారు. సుమారు వెయ్యి మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు సమాచారం. కానీ ఎంతమంది వస్తున్నారో కచ్చితంగా తెలియదన్నారు. ఆధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఎవరు వచ్చినా రిసీవ్‌ చేసుకుని వారికి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వసతి కల్పించి, ఆ తర్వాత వారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

పూర్తిగా వారిని ప్రభుత్వ ఖర్చులతోనే తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని గుర్తుచేశారు. విద్యార్థులు సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటే వారిని రిసీవ్‌ చేసుకుని పంపించే ఏర్పాట్ల చేస్తామని విదేశాంగ శాఖ అధికారులు చెప్పారని అన్నారు. ఎక్కడివారు అక్కడే సురక్షితంగా ఉండాలని సూచించారని అన్నారు. ఎలాగోలా సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటే భారత్‌కు తీసుకువెళ్తారనే ఉద్దేశంలో ఎటువంటి సాహసాలు చేయెద్దని సూచించారని చెప్పారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులు గమనించే విదేశాంగశాఖ ఎప్పటికప్పుడూ సూచనలు ఇస్తుందని వాటిని తప్పక పాటించాలని కూడా చెప్పారని తెలిపారు.

మరిన్ని వార్తలు