తస్సాదియ్య.. రొయ్య దూకుడు మామూలుగా లేదయ్యా!

16 Sep, 2021 19:55 IST|Sakshi

సముద్రంలో వేటకు వెళ్లాలంటే మత్స్యకారుల్లో ఏదో తెలియని నైరాశ్యం. నాలుగైదు రోజుల పాటు నడి సంద్రంలో వేటాడినా కూలి డబ్బులు కూడా దక్కక డీలా పడేవారు. రెండు నెలల నుంచి ఈ పరిస్థితి మారింది. సముద్రంలో వల విసిరితే చాలు నిండా రొయ్యల సంపద వచ్చిపడుతోంది. వేటకు వెళ్తున్న మత్స్యకారులు రెండు రోజులకే బోట్లను రొయ్యలతో నింపుకుని తీరం బాట పడుతున్నారు. ఆ వెంటనే వేటకు సిద్ధమైపోతున్నారు.

బాపట్ల(గుంటూరు):మూడేళ్లుగా వరుస తుఫాన్లతో సముద్రంలో వేట సక్రమంగా సాగక డీలాపడిన తీరప్రాంత మత్స్యకారులు ఇప్పుడు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు.రొయ్యల వేట వారికిప్పుడు పండుగ వాతావరణం తెచ్చింది. ఈ ఏడాది రెండు నెలలుగా వేట బాగా కలిసి వస్తోంది. కోనమ్‌.. సందువాలు.. మొయ్య.. పండు చేపలకే పరిమితమైన సముద్రపు వేట కాస్తా ఇప్పుడు రొయ్యలు పుష్కలంగా పడుతుండటంతో మత్స్యకారుల పంట పండుతోంది. సాధారణంగా ఆక్వా సాగులో 40 నుంచి 25 కౌంట్‌ సైజు రొయ్యల్ని చూడాలంటే రైతులకు ఎంతో కష్టంగా ఉంటుంది. అది కూడా బాగా ఖర్చుతో కూడుకున్న పని. అయితే, ఇటీవల సముద్రంలో 20 కౌంట్‌ రొయ్యలు కూడా పడుతుండటంతో మత్స్యకారుల ఆనందం అవధులు దాటింది. వల వేస్తే చాలు నిండా రొయ్యలే వస్తుండటంతో సముద్రంలో కనీసం నాలుగైదు రోజుల పాటు వేట చేసే మత్స్యకారులు ఇప్పుడు రెండు రోజులకే ఇళ్లకు చేరుతున్నారు. 

ధర బాగు.. బాగు
బాపట్ల మండలంలోని అడవి పల్లెపాలెం, కృపానగర్, దాన్వాయ్‌పేట, ఓడరేవు ప్రాంతాల్లో రొయ్యల వేట వేగవంతంగా సాగుతోంది. ఈ ప్రాంతంలో 3 వేల మత్స్యకార కుటుంబాలు ఉండగా.. వేటకు వెళ్లే బోట్లు 800 వరకు ఉన్నాయి. చేపల వేటకు ఉపయోగించే వలలు కాకుండా రొయ్యలకు డిస్కో వలలను ఉపయోగించటం వలన రొయ్యల వేట సంతృప్తికరంగా ఉంటోందని మత్స్యకారులు చెబుతున్నారు. ఒక్కొక్క బోటులో 8 నుంచి 10 మంది వేటకు  వెళ్తున్నారు. ఎక్కువగా వనామీ, టైగర్‌ రొయ్యలు వలలకు చిక్కుతున్నాయి. 400 కేజీల వనామీ రొయ్యలు పడితే వాటిలో 40 నుంచి 50 కేజీలు టైగర్‌ రొయ్యలు పడుతున్నాయి. అదికూడా 20 నుంచి 40లో కౌంట్‌ ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వనామీ 40 కౌంట్‌ రొయ్యల ధర రూ.480 నుంచి 500 ఉండగా.. టైగర్‌ రొయ్య 20 కౌంట్‌ ధర రూ.500 నుంచి రూ.600 వరకు పలుకుతోంది.

తక్కువ దూరంలోనే..
వాతావరణం అనుకూలంగా ఉండటంతో సముద్ర తీరం నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే మత్స్య సంపద దొరుకుతోంది. దీనివల్ల ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. ఒక్కసారి వేటకు వెళితే గతంలో రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు రూ.20 వేల లోపే ఖర్చవుతోంది. 
– జి.అప్పలరాజు, మత్స్యకారుడు

ఓడరేవులోనే మార్కెట్‌ 
రొయ్యలు ఎక్కువగా పడుతుండటంతో చీరాల ఓడరేవుకే కొనుగోలుదారులు వస్తున్నారు. కొనుగోలు చేసిన రొయ్యలకు వారం రోజుల్లోపు నగదు చెల్లిస్తున్నారు. ఐస్, సబ్సిడీపై డీజిల్‌ అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
– చొక్కా సత్యనారాయణ, మత్స్యకారుడు 

చదవండి: భద్రతకు ‘దిశ’ నిర్దేశం

మరిన్ని వార్తలు