ఏపీ రొయ్య.. మీసం మెలేసింది!

27 Sep, 2021 07:58 IST|Sakshi

దేశంలో రొయ్యల ఉత్పత్తిలో 75.84%  ఏపీ నుంచే 

2020–21లో దేశవ్యాప్తంగా 8,43,633 టన్నుల రొయ్యల ఉత్పత్తి 

అందులో ఏపీ నుంచే 6,39,894 టన్నులు రొయ్యల ఉత్పత్తిలో 

25 శాతం వృద్ధి నమోదు

సాక్షి, అమరావతి: దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. 2020–21 ఆరి్థక సంవత్సరంలో దేశ రొయ్యల ఉత్పత్తిలో ఏపీ 75.84% వాటాతో దూసుకుపోయినట్లు మెరైన్‌ ప్రోడక్టస్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంపెడా) తెలిపింది. 2020–21లో దేశవ్యాప్తంగా 8,43,633 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే అందులో ఏపీలోనే 6,39,894 టన్నులు ఉత్పత్తి అయినట్లు ఎంపెడా జాయింట్‌ డైరెక్టర్‌ జయబాల్‌ తెలిపారు.

ఇందులో అత్యధికంగా వనామి రకం రొయ్యలు 6,34,672 టన్నులు ఉత్పత్తి అయ్యిందని, బ్లాక్‌ టైగర్‌ రొయ్యలు వాటా 5,222 టన్నులని చెప్పారు. సముద్ర ఉత్పత్తుల్లో కూడా ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. 2021లో రాష్ట్రం నుంచి 2,90,859 టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని వీటి విలువ రూ.16,733.81 కోట్లని వివరించారు. 

పెరిగిన సాగు, ఉత్పత్తి... 
అంతకుముందు ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో రొయ్యల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2019–20తో పోలిస్తే రాష్ట్రంలో సాగు విస్తీర్ణంలో 15.41%, ఉత్పత్తిలో 24.91% వృద్ధి నమోదైంది. 2019–20లో 64,559.94 హెక్టార్లలో సాగు చేయడం ద్వారా 5,12,244.4 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే 2020–21లో సాగు విస్తీర్ణం 74,512 హెక్టార్లకు పెరిగి ఉత్పత్తి 6,39,894 టన్నులకు చేరింది. దేశవ్యాప్తంగా రొయ్యల సాగు విస్తీర్ణంలో రాష్ట్ర వాటా 44.69%గా ఉన్నట్లు ఎంపెడా పేర్కొంది.

రాష్ట్రంలో 188 మండలాల్లో 1,553 గ్రామాల్లో 53 వేల చెరువుల్లో ఆక్వా చెరువు సాగు జరుగుతోంది. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతుదారులు 154 మంది ఉండగా, 97 ప్రోసెసింగ్‌ యూనిట్లు, 97 శీతల గిడ్డంగులు ఉన్నట్లు ఎంపెడా పేర్కొంది. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతులు ప్రోత్సహించడానికి ఎంపెడా కృషి చేస్తోందని, ఇందుకోసం కాల్‌సెంటర్‌ నంబర్‌ 18004254648ను కేటాయించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు