థర్డ్‌ వేవ్‌పై ముందే అప్రమత్తం 

6 Jun, 2021 03:52 IST|Sakshi

45 ఏళ్లలోపు వారు జాగ్రత్తగా ఉంటే కోవిడ్‌ నుంచి తప్పించుకోవచ్చు

టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో వైద్య నిపుణుల అభిప్రాయం

పదేళ్లలోపు పిల్లలకు వస్తే.. అందించాల్సిన వైద్యంపై ప్రత్యేక చర్చ

18 ఏళ్ల పైబడిన వారికి ఆగస్టు నుంచి వ్యాక్సిన్‌ వేసేందుకు కార్యాచరణ సిద్ధం..  

సాక్షి, అమరావతి:  కరోనా మూడవ వేవ్‌ గురించి పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేయించుకోని 45 ఏళ్లలోపు వారిపై ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్రం నుంచి పరిమిత స్థాయిలోనే రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్‌ కేటాయింపులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు 45 ఏళ్ల వయసు దాటిన వారికే టీకా వేస్తున్న విషయం తెలిసిందే. అంతకంటే తక్కువ వయసు ఉన్నవారికి మరో రెండు మాసాల తర్వాతే వ్యాక్సిన్‌ వేసేందుకు అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో థర్డ్‌ వేవ్‌ రావచ్చన్న నిపుణుల వ్యాఖ్యలతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. దీనిపై కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ శనివారం సమావేశమై చర్చించింది. సెకండ్‌ వేవ్‌ ముగిశాక కనీసం రెండున్నర నుంచి మూడు మాసాలపాటు వైరస్‌ తీవ్రత ఉండకపోవచ్చని, ఆ తర్వాతే తిరిగి వైరస్‌ ప్రభావం ఉండవచ్చన్న అంచనాలపై సమావేశంలో చర్చించారు. టీకా వేసేవరకు 45 ఏళ్లలోపు వారిని అప్రమత్తంగా ఉంచితే కోవిడ్‌ నుంచి తప్పించుకోవచ్చునని ఇందులో పాల్గొన్న వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. మాస్కు విధిగా వాడటం, భౌతిక దూరం పాటించడం విషయంలో 45 ఏళ్లలోపు వారు వ్యాక్సిన్‌ వేసేవరకు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని వారు సూచించారు. 

పదేళ్లలోపు వారిపై ప్రత్యేక దృష్టి 
పదేళ్లలోపు వారికి కరోనా సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో ప్రత్యేకంగా చర్చించారు. ఇందులో  పలువురు పీడియాట్రిక్‌ నిపుణులూ ఉన్నారు. మొదటి వేవ్, సెకండ్‌వేవ్‌లో ఎంతమంది చిన్నారులు ప్రభావితమయ్యారో అంతకు రెట్టింపు అంచనా వేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలని పలువురు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో చిన్న పిల్లల వైద్యనిపుణులు ఎంతమంది ఉన్నారు.. ఎన్ని పీడియాట్రిక్‌ వార్డులున్నాయి.. పీడియాట్రిక్‌ ఐసీయూ వార్డులు ఎన్ని, ఆక్సిజన్‌ పడకలు ఎన్ని ఇలా కేటగిరీల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. మూడవ వేవ్‌కు సంబంధించిన అంచనాలు, ఏర్పాట్లు తదితర వాటిపై ముఖ్యమంత్రి వద్ద సోమవారం సమీక్ష సమావేశం జరగనుంది.

ఆగస్టు నుంచి 18 ఏళ్లు పైన వారికి వ్యాక్సిన్‌ 
జూలై చివరి నాటికి 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. వీరికి పూర్తవగానే ఆగస్టు మొదటివారంలో 18 ఏళ్లు దాటి.. 45 ఏళ్లలోపు ఉన్న వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రోజుకు 6 లక్షల డోసులు పైగా టీకా వేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని, ఆగస్టు నాటికి టీకా మరింత ఎక్కువగా వచ్చే వీలుందని, దాంతో వీలైనంత త్వరగా వారికి టీకా పూర్తి చేస్తే కరోనా నుంచి తప్పించుకోవచ్చునని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు.   

మరిన్ని వార్తలు