Andhra Pradesh: నీళ్లు.. ఫుల్లు

26 Apr, 2022 03:36 IST|Sakshi

రాష్ట్రంలో నిండుగా చెరువులు.. మెండుగా తాగు నీరు 

మొత్తం 1,278 సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు 

దాదాపు అన్నింటిలో వేసవికి సరిపడా నీరు 

నీరు లేనివి ఎనిమిదే.. అక్కడ ట్యాంకర్లు, బోర్ల ద్వారా నీరు 

ఈ వేసవిలో గ్రామాల్లో మంచినీటికి రూ.42.53 కోట్లతో ముందస్తు ప్రణాళిక  

పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామ సమీపంలోని సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు (మంచినీటి చెరువు) బొగ్గరం, చిన్న కొండాయపాలెం, పెద్ద కొండాయపాలెం, గుండేపల్లి గ్రామాల్లో ఉండే దాదాపు 1,200 కుటుంబాలకు మంచి నీరు అందిస్తుంది. పది రోజుల కిందట నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కుడి కాల్వకు సాగు నీటి విడుదల నిలిపివేసే సమయంలోనే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది ఈ ట్యాంకును నింపారు. ప్రస్తుతం చెరువు నీటిని మే, జూన్‌ నెలలు పూర్తిగా, జులై నెలలో దాదాపు సగం రోజులపైనే ఆ గ్రామాలకు సరఫరా చేయవచ్చని అధికారులు తెలిపారు.

గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో 1,480 కుటుంబాలు ఉంటాయి. ఆ గ్రామంలో నిరంతరం మంచినీటి సరఫరాకు ప్రత్యేకంగా సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు ఉంది. ఇది పూర్తిగా నిండుగా ఉంది. వచ్చే 120 రోజుల పాటు తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ మండలంలో మొత్తం 8 సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు ఉండగా, అవన్నీ 90 శాతం నీటితో నిండి ఉన్నాయి.
– సాక్షి, అమరావతి

ఇవే కాదు.. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అధిక శాతం చెరువులను నింపింది. రాష్ట్రవ్యాప్తంగా 1278 సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో 76 శాతానికి పైగా చెరువులు వేసవికి సరిపడా నీటితో నిండి ఉన్నాయని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వెల్లడించారు. నాలుగో వంతు చెరువుల్లో మూడు నెలలకు సరిపడా నీరు ఉందని చెప్పారు. 60 శాతం చెరువుల్లో రెండు నెలలకు పైబడి నీరు ఉన్నట్టు తెలిపారు. 

30 రోజులకు లోపు 57 చెరువుల్లోనే 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 31, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో తొమ్మిది, కర్నూలు జిల్లాలో ఎనిమిది చెరువుల్లో నెల రోజుల లోపు అవసరమయ్యే నీరు ఉంది. ఆ ట్యాంకుల సామర్థ్యం తక్కువగా ఉన్నందువల్లే తక్కువ నీరు ఉన్నట్లు అధికారులు చెప్పారు. కేవలం 8 చెరువుల్లోనే వివిధ కారణాలతో నీరు లేదని తెలిపారు. ఈ ట్యాంకుల పరిధిలోని గ్రామాలకు వేసవిలో ట్యాంకర్ల ద్వారా లేదంటే బోర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారులు చెప్పారు. 

రూ.42.53 కోట్లతో వేసవి తాగునీటి ప్రణాళిక 
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.42.53 కోట్లతో ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది.  ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం గణాంకాల ప్రకారం గ్రామాలను 48 వేలకు పైబడి నివాసిత ప్రాంతాలుగా వర్గీకరించగా, అందులో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని 105– 132 నివాసిత ప్రాంతాలకు మాత్రమే ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు కొనసాగుతుందని.. ఈ వేసవిలో అవసరమైతే గరిష్టంగా 1855 నివాసిత ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఎండలు మరింత పెరిగితే 242 నివాసిత ప్రాంతాల్లో పశువుల అవసరాలకు సైతం ఈ వేసవిలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడొచ్చని ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం ముందస్తు అంచనా వేసుకుంది. 

మరిన్ని వార్తలు